DPRO ADB- పట్టణంలోని ప్రతి ఇంటికీ త్రాగునీరు అందించేలా చర్యలు చేపట్టాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

పట్టణంలోని ప్రతి ఇంటికీ త్రాగునీరు అందించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పట్టణంలో త్రాగునీరు నీటిసరఫరా, చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై మున్సిపల్, మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, వార్డుల వారిగా ప్రతి ఇంటికి త్రాగునీరు అందించాలని సూచించారు. ముఖ్యంగా కేఆర్కే కాలనీలో తలెత్తిన నీటి సమస్యను మిషన్ భగీరథ, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పరిష్కరించి వెంటనే త్రాగునీరు అందించాలన్నారు. అలాగే పట్టణంలో ప్రధాన కూడళ్లు, జంక్షన్లలో నిర్మిస్తున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తిచేయాలని అన్నారు. హరితహారం లో భాగంగా నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలను నాటాలని అన్నారు. వచ్చే సంవత్సరం హరితహారం కార్యక్రమానికి కావలసిన మొక్కల పెంపకానికి పట్టణ నర్సరీల ఏర్పాట్లకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. జూన్ లో ప్రారంభం కానున్న పట్టణ ప్రగతి కార్యక్రమానికి కావలసిన ఏర్పాట్లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. అలాగే పట్టణంలో చేపడుతున్న మన బస్తి- మన బడి, ఇతర అభివృద్ధి పనుల పురోగతిపై ప్రతి వారం సమీక్షించాలని మున్సిపల్ శాఖ ఎస్.ఈ. ని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు రిజ్వాన్ బాషా షేక్, ఎన్.నటరాజ్, ఆర్డీఓ రమేష్ రాథోడ్, మున్సిపల్ కమీషనర్ శైలజ, మున్సిపల్ శాఖ ఎస్.ఈ. శ్రీనివాసరా రావు, మిషన్ భగీరథ ఎస్.ఈ. వెంకటేశ్వర్లు, విద్యుత్ శాఖ ఎస్.ఈ. ఉత్తమ్, ఆదిలాబాద్ పట్టణ తహసీల్దార్ సతీష్, మున్సిపల్, మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post