DPRO ADB-పట్టణ ప్రగతిలో ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు చేపట్టాలి – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

పట్టణ ప్రగతిలో ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శ‌నివారం ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తిలో భాగంగా శాంతి నగర్ (వార్డ్ నంబర్ 34)లో నిర్వహిస్తున్న పారిశుధ్య పనులను మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ తో కలిసి ఆమె పరిశీలించారు. అనంతరం ఆలయ కమిటీ హాలులో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని గత పట్టణ ప్రగతి కార్యక్రమాలలో చేపట్టిన పనుల పురోగ‌తి, సమస్యల ప‌రిష్కారం, 4వ విడత పట్టణ ప్రగతిలో చేపట్టవలసిన పనులపై ఆమె అధికారులను, వార్డు ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, పట్టణ ప్రగతిలో రోడ్లు, మురుగు కాలువలు, పరిసరాల పరిశుభ్రత తో పాటు పచ్చదనం పెంపొందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకుని సీజ‌న‌ల్ వ్యాధుల భారిన ప‌డ‌కుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలతో ప‌ల్లె, ప‌ట్ట‌ణాల్లో ఎన్నో అభివృద్ది ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని వివరించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతిలో అందరూ పాల్గొని సమగ్ర అభివృద్ధిలో భాగ‌స్వాములు కావాల‌ని కోరారు. మున్సిపల్ ఛైర్మెన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ, పట్టణ ప్రగతిలో ప్రజల భాగస్వామ్యంతో అవసరమైన అభివృద్ధి పనులు చేపడతామని అన్నారు. ప్రతి ఇంటి నుండి చెత్త సేకరణ, విద్యుత్, త్రాగు నీరు, సిసి రోడ్ల నిర్మాణం తదితర పనులు చేపట్టడం జరుగుతుందని వివరించారు. అనంతరం తడి,పొడి చెత్తను వేరుగా సేకరించేందుకు చెత్త బుట్టలను వార్డు ప్రజలకు పంపిణి చేసారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్. నటరాజ్, ఆర్డీఓ రాథోడ్ రమేష్, మున్సిపల్ కమిషనర్ శైలజ, ప్రజాప్రతినిధులు, అధికారులు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Share This Post