DPRO ADB- పదవతరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా నిర్వహిస్తున్నాం -జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

పదవ తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. పదవతరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో సోమవారం రోజున స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాలక్ మందిర్ లలో నిర్వహిస్తున్న పరీక్షా కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. ఆయా పాఠశాలల చీఫ్ సూపరింటెండెంట్ లతో మాట్లాడుతూ, విద్యార్థులు హాజరు, విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలు, తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. మాస్ కాపీయింగ్ కు తావివ్వకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు పంపించే సమయంలో తనిఖీలు నిర్వహించాలని, అనుమతి లేని ఏ వస్తువు కూడా కేంద్రంలోపలికి అనుమతించ కూడదని తెలిపారు. పరీక్షా కేంద్రాలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పని తీరును, బ్యాక్ అప్ వివరాలను ఆయా చీఫ్ సూపరింటెండెంట్ ను అడిగి తెలుసుకున్నారు. వేసవి నేపథ్యంలో త్రాగునీరు అందుబాటులో ఉంచాలని, అత్యవసర సేవలు అందించేందుకు వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలనీ జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం పదవతరగతి పరీక్షలను జిల్లాలో 64 కేంద్రాలలో నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 11,288 మంది విద్యార్థులకు గాను మొదటి రోజు 11,132 మంది హాజరయ్యారని, 156 మంది విద్యార్థులు గైర్హాజరు కావడం జరిగిందని తెలిపారు. పరీక్షల నిర్వహణకు జిల్లా యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. అదనపు కలెక్టర్లు, సీనియర్ అధికారులు, మండల స్థాయిల్లో తహసీల్దార్లు పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ స్థానిక సరస్వతి నగర్ బాలికల ఉన్నత పాఠశాల, లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ లలోని పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి ఏర్పాట్లను పర్యవేక్షించడం తో పాటు విద్యార్థులు హాజరు, పరీక్షా నిర్వహణ తీరును ఆయన పరిశీలించారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారిణి టి.ప్రణీత, మండల విద్యాశాఖ అధికారిణి జయశీల, తదితరులు ఉన్నారు.

Share This Post