DPRO ADB- పల్లె ప్రగతిని విజయవంతం చేయండి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ఐదవ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయుటకు ప్రజాప్రతినిధులు సహకరించి జిల్లా అభివృద్ధికి తోడ్పాటు అందించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదిలాబాద్ శాసన సభ్యులతో కలిసి జడ్పీటీసీ లు, ఎంపీపీ లు, అధికారులతో పల్లె ప్రగతి నిర్వహణ పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, శాసన సభ్యులు, జడ్పీటీసీ లు, ఎంపీపీ ల సలహాలు, సూచనల మేరకు పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జూన్ 3 నుండి 18 వరకు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని తెలిపారు. గతంలో గ్రామాలలో ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుల తో సభ్యులతో సమావేశాలు నిర్వహించి గ్రామాల అభివృద్ధికి చేపట్టాల్సిన పనులు, పల్లె ప్రగతిలో గతంలో చేపట్టిన పనుల పర్యవేక్షణపై సమీక్షిస్తామని తెలిపారు. ప్రజాప్రతినిధుల సూచనల మేరకు మండలంలోని వివిధ శాఖల అధికారులను గ్రామపంచాయితీలలో ప్రత్యేక అధికారులుగా నియమించి ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణతో పాటు, పారిశుద్యం, పచ్చదనం వంటి కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. గతంలో నిర్వహించిన పల్లె ప్రగతిలో విద్యుత్ సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని ట్రాన్స్కో ఎస్.ఈ. ని ఆదేశించారు. గ్రామాలలో జిల్లా స్థాయి అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ప్రభుత్వ కార్యక్రమాలు అమలు జరిగేలా పర్యవేక్షిస్తామని, విధులలో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. వచ్చే పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి రోజు ఒక కార్యక్రమాన్ని నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం నిర్వహించడం జరుగుతుందని, ప్రతి మండలంలో రెండు తెలంగాణ క్రీడా ప్రాంగణాలను జూన్ 2 న ప్రారంభించడం జరుగుతుందని, అట్టి పనులు చురుగ్గా సాగుతున్నాయని, సుమారు 50 వేల రూపాయల విలువగల సామాగ్రి, ఉపాధి హామీ పథకం క్రింద భూములను చదును చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో మన ఊరు- మన బడి కార్యక్రమం పనులు జరుగుతున్నాయని తెలిపారు. పాఠశాలల ప్రారంభం నాటికి ప్రతి మండలంలో రెండు పాఠశాలలు మాడల్ పాఠశాలలుగా ఏర్పాటు చేయాలనీ అధికారులను ఆదేశించడం జరిగిందని అన్నారు. ఆదిలాబాద్ శాసన సభ్యులు జోగు రామన్న మాట్లాడుతూ, గ్రామాలలో పారిశుధ్య కార్యక్రమాలు, ఇంటింటి చెత్త సేకరణ, హరితహారం వంటి కార్యక్రమాలు పంచాయితీ కార్యదర్శులు నిర్వహించడం తో పాటు పర్యవేక్షించాలని అన్నారు. గ్రామాలలో విద్యుత్ పోల్స్ , లూస్ వైర్లను సరి చేయడం, పాడుబడిన ఐరన్ పోల్స్ తొలగించి వాటి స్థానంలో కొత్త పోల్స్ వేయాలని అన్నారు. వైకుంఠధామాలలో విద్యుత్ సౌకర్యం, నీటి సౌకర్యం కల్పించాలని, వైకుంఠధామాలను వినియోగంలోకి వచ్చే విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేయాలనీ అన్నారు. గ్రామాల అభివృద్ధికి గ్రామస్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీలతో సమావేశాలు నిర్వహించి గ్రామ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి పనులు చేపట్టాలని అన్నారు. గ్రామాలలోని హోటళ్లు, పాన్ షాపులు, మటన్ మార్కెట్లు, తదితర ప్రాంతాలలో పారిశుద్యం లోపించిందని వాటిపై పంచాయితీ కార్యదర్శుల పర్యవేక్షణ చేయాలనీ అన్నారు. అధికారులు గ్రామాల్లో పర్యటించినపుడే గ్రామస్థాయి సిబ్బంది విధులు సక్రమంగా నిర్వహిస్తారని అన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ, గ్రామాలలో నిర్మించుకున్న మరుగుదొడ్లను వినియోగించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని, ఇంకను మరుగుదొడ్లు లేనివారికి మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలనీ కోరారు. జిల్లాలోని సమస్యలపై ప్రణాళికలు రూపొందించి ప్రణాళిక బద్దంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న భవనాలను తొలగించడానికి అనుమతి మంజూరు చేశామని అన్నారు. పలువురు జడ్పీటీసీ లు, ఎంపీపీ లు మాట్లాడుతూ, గ్రామాలలో ముఖ్యం గా గిరిజన గ్రామాలలో వంగిన విద్యుత్ పోల్స్, లూస్ వైర్లు సరిచేయాలని అన్నారు. మరుగుదొడ్ల నిర్మాణాలకు చెల్లింపులు జరగలేదని, మరికొంత మందికి మంజూరు చేయవలసి ఉందని తెలిపారు. వైకుంఠ ధామాలకు, పాఠశాలలకు నీటి సరఫరా చేయాలనీ కోరారు. గ్రామాలలో తడి, పొడి చెత్త సేకరించడం లేదని, కంపోస్ట్ షెడ్ లో ఎరువులను తయారు చేయడం లేదని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, జడ్పీ సీఈఓ గణపతి, విద్యుత్ శాఖ ఎస్.ఈ. ఉత్తమ్, RWS ఎస్.ఈ.వెంకటేశ్వర్లు, అదనపు డిఆర్డిఓ రవీందర్ రాథోడ్, జడ్పీటీసీ లు, ఎంపీపీ లు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post