DPRO ADB -పురపాలక సంఘం పరిధిలో హరితహారం లక్ష్యం మేరకు మొక్కలు నాటేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి- స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.

పురపాలక సంఘం పరిధిలో చేపట్టనున్న హరితహారంలో లక్ష్యం మేరకు మొక్కలు నాటేలా ప్రణాళికలు సిద్ధం చేయాలనీ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆదిలాబాద్ పురపాలక సంఘ కార్యాలయంలో పట్టణంలో 8వ విడత తెలంగాణకు హరితహారం కార్యక్రమం అమలుపై మున్సిపల్ శాఖ అధికారులతో ఆయన ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, జులై మాసంలో ప్రారంభం కానున్న హరితహారం కార్యక్రమం అమలుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను సూచించారు. పురపాలక సంఘం పరిధిలో ఈ సంవత్సరం 5 లక్షల 50 వేల మొక్కలు నాటడానికి ప్రణాళికలు రూపొందించడం జరిగిందని తెలిపారు. లక్ష్యానికి అనుగుణంగా నర్సరీలలో కావలసిన మొక్కలు అందుబాటులో ఉంచాలని, వేసవి దృష్ట్యా మొక్కల సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటేలా స్థలాలను గుర్తించాలని అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలలో పచ్చదనం పెంపొందే విధంగా విరివిగా మొక్కలు నాటాలన్నారు. పట్టణం ప్రకృతి వనాలు, బృహత్ పట్టణం ప్రకృతి వనాలు, అర్బన్ పార్క్ లలో లక్ష్యం మేరకు మొక్కలు నాటి వాటిని సంరక్షించేలా ఇంచార్జి అధికారులను నియమించాలని అన్నారు. నీటి సరఫరాకు ఆరు నీటి ట్యాంకర్లు, పట్టణంలోని అంతర్గత రోడ్ల డివైడర్లలో ఎర్ర మట్టి, ప్రకృతి వనాలలో డ్రిప్పు, స్పిన్ క్లేర్ ల ఏర్పాట్లకు టెండర్లను ఆహ్వానించాలని కమిషనర్ కు సూచించారు. పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత నివ్వాలని, ప్రతి రోజు వాహనాల ద్వారా ప్రతి ఇంటి నుండి తడి, పొడి చెత్త వేరు వేరుగా వందశాతం సేకరించాలన్నారు. వార్డుల వారీగా ప్రత్యేక అధికారులు ప్రతి రోజు రిపోర్టును తనకు పంపాలని అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ శైలజ, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post