పోడుభూముల సమస్యలు పరిష్కరించడంతో పాటు అటవీ సంపదను కాపాడుకునే విధంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం రోజున కలెక్టరేట్ నుండి తహసీల్దార్లు, ఎంపీడీఓ లు, సర్పంచ్ లు, పంచాయితీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారులతో పోడుభూముల క్లెయిమ్స్, ఎఫ్.ఆర్.సి. ల ఏర్పాటు, గ్రామసభల నిర్వహణ, తదితర అమాశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 8 నుండి పోడుభూముల సమస్యలు పరిష్కరించడంతో పాటు అటవీ సంపదను కాపాడుకునే విధంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. కమిటీలు అటవీ హక్కుల చట్టం పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. చట్టప్రకారం చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ నెల 8 నుండి 12 వరకు క్లెయిమ్స్ ఫారాలను అర్హులైన వారికీ అందజేయాలని తెలిపారు. అటవీ హక్కుల కమిటీలను రేపటిలోగా ఏర్పాటు చేయాలనీ, సర్పంచ్ లను భాగస్వాములను చేయాలనీ, రాష్ట్ర ముఖ్యమంత్రి పోడుభూముల సమస్యల పరిష్కారాలకు తీసుకుంటున్న చర్యలతో పాటు అటవీ సంరక్షణ అంశాలపై గ్రామగ్రామాన వివరించాలని పేర్కొన్నారు. అర్జీలను ఆధారాలతో పాటు స్వీకరించాలని, ప్రతి అర్జీదారునికి రసీదు తప్పనిసరిగా అందజేయాలని, ప్రతి అర్జీని రిజిస్టర్ లో నమోదు చేయాలనీ అన్నారు. అటవీ హక్కుల కమిటీల వివరాలను గ్రామసభలో వివరించి మినిట్స్ నమోదు చేయాలనీ తెలిపారు. ఈ ప్రక్రియలో ఎలాంటి తప్పిదాలకు చోటివ్వకుండా పక్కాగా పరిశీలన, సర్వే నిర్వహించాలని అన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ, 13 డిసెంబర్ 2005 నాటికీ ముందునుండే అటవీ భూముల్లో సాగు చేస్తున్నవారికి అటవీ యాజమాన్య హక్కు పత్రాలను అందజేయడం జరుగుతుందని గ్రామాల్లో అవగాహన కల్పించాలని అన్నారు. ప్రతి హాబిటేషన్ కు రెండు రిజిస్టర్ లు సరఫరా చేయడం జరుగుతుందని మినిట్స్ నమోదు చేయాలనీ, కమిటీల ఏర్పాటు వివరాలను నమోదు చేయాలనీ తెలిపారు. అదేవిధంగా గ్రామసభలో అటవీ హక్కుల ప్రక్రియ 8 వ తేదీ నుండి ప్రారంభమౌతున్నట్లు ప్రకటించి మినిట్స్ రిజిస్టర్ లో నమోదు చేయాలనీ అన్నారు. ROFR భూములకు హక్కు పత్రాల కోసం నిర్ణిత ఫారం-ఏ లో పూర్తివివరాలతో పాటు గుర్తింపు కార్డు లను జతచేసి దరఖాస్తు దారు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. అట్టి వాటిని స్క్రూటినీ చేయాలనీ తెలిపారు. దరఖాస్తు పై లబ్దిదారులకు అవగాహన కల్పించాలని అన్నారు. ఏరోజుకారోజు ఎన్ని దరఖాస్తులు రావడం జరిగిందో అట్టి వివరాలను ప్రతిరోజూ నిర్ణిత ప్రొఫార్మాలో సమర్పించాలని అన్నారు. గ్రామపంచాయితీ స్థాయి కమిటీలకు సరఫరా చేయనున్న రిజిస్టర్ లలో అర్జీదారులు వివరాలను నమోదు చేయాలనీ అన్నారు. ఈ ప్రక్రియ అంతను పంచాయితీ కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గ్రామస్థాయి కమిటీలు సబ్ డివిజినల్ స్థాయి కమిటీలకు అర్జీలను పంపడం జరుగుతుందని తద్వారా సబ్ డివిజినల్ స్థాయి కమిటీలు దరఖాస్తులను పరిశీలించి జిల్లా స్థాయి కమిటీకి పంపడం జరుగుతుందని తెలిపారు. అటవీ హక్కు చట్టం నిబంధనలను అనుసరించి జిల్లా కమిటీ అర్జీలను పరిశీలించి హక్కు పత్రాలను జారీచేయడం జరుగుతుందని వివరించారు. ఉట్నూర్ నుండి ITDA ప్రాజెక్టు అధికారి అంకిత్ పాల్గొని మాట్లాడుతూ, అటవీ హక్కులకు సంబందించిన అన్ని విషయాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరించడం జరిగిందని, ప్రతి టీమ్ వారి విధులను చట్టప్రకారం నిర్వహించాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అటవీ అధికారి రాజశేఖర్, జిల్లా పంచాయితి అధికారి శ్రీనివాస్, ఆర్డీఓ రాజేశ్వర్, తహసీల్దార్లు, ఎంపీడీఓ లు, సర్పంచ్ లు, పంచాయితీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు, తదితరులు పాల్గొన్నారు.