DPRO ADB – ప్రజల భాగస్వామ్యంతోనే పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతం – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ప్రజల భాగస్వామ్యంతో పల్లె ప్రగతి కార్యక్రమాలు విజయవంతం అవుతాయని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం రోజున బేల మండలంలోని జునోని, చాంద్ పల్లి గ్రామాలలో పల్లె ప్రగతి కార్యక్రమాలలో పాల్గొని గ్రామాలలో నిర్మించిన వైకుంఠధామాలు, సేగ్రిగేషన్ షెడ్లు, నర్సరీలు, మన ఊరు- మన బడి కార్యక్రమం క్రింద చేపడుతున్న పాఠశాలల మరమ్మతులను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశాలలో కలెక్టర్ మాట్లాడుతూ, ఐదవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఐదవ రోజున జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నామని తెలిపారు.
ప్రభుత్వం చేపట్టే వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలలో ప్రజల భాగస్వామ్యంతోనే విజయవంతం అవుతాయని అన్నారు. హరితహారం కార్యక్రమ నిర్వహణకు ప్రతి నర్సరీలో 11 వేల మొక్కలను పెంచడం జరుగుతుందని, వచ్చే హరితహారం కార్యక్రమం క్రింద గ్రామాలలోని ఖాళీ స్థలాలు, ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాలు, గ్రామాలకు అనుసంధానమైన అన్ని రోడ్లకు ఇరువైపులా మల్టి లేయర్ వరుస క్రమాలలో మొక్కలను నాటి సంరక్షించాలని అన్నారు. ఆయా గ్రామాలలో కలెక్టర్ మొక్కలను నాటారు. ఇప్పటికే గ్రామాలలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలలో యాదాద్రి మాడల్ లో మొక్కలు నాటి చిట్టడవి గా ఏర్పాటు చేయాలనీ సూచించారు. ఎంపీఓ లు సర్పంచ్ లకు శిక్షణ నిర్వహించాలని సూచించారు. గ్రామాలలోని తడి, పొడి చెత్తను విడివిడిగా సేకరించి సేగ్రిగేషన్ షెడ్ లలో ఎరువును తయారుచేయాలని, అట్టి ఎరువును అవసరానికి పోగా రైతులకు విక్రయించి ఆర్థికంగా గ్రామపంచాయితీలు ఎదగాలని అన్నారు. వైకుంఠధామలను వినియోగించుకోవాలని, గ్రామాలలో క్రీడా ప్రాంగణాలకు అవసరమైన భూములను గుర్తించి ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నామని, యువతకు పిల్లలకు ఆటలలో ప్రావిణ్యం పెంపొందించేందుకు దోహదపడతాయని అన్నారు. అవసరమైన ఆటల కిట్లు, స్పోర్ట్స్ బనియన్స్, తదితర వాటిని సమకూర్చుతామని తెలిపారు. మన ఊరు- మన బడి కార్యక్రమం క్రింద జిల్లాలో మొదటి విడతలో చేపట్టిన పనులు జరుగుతున్నాయని, రానున్న మూడు సంవత్సరాలలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలల ధీటుగా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. బడి బాట కార్యక్రమంలో భాగంగా బడి బయట ఉన్న బడి ఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని గ్రామస్తులకు సూచించారు. గ్రామాలలో ఇంటింటికి నిర్మించిన మరుగుదొడ్లను వినియోగించుకోవాలని, ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలని అన్నారు. గ్రామాలలో పారిశుద్యం నిర్వహణ, పచ్చదనం పెంపొందించేలా పంచాయితీ కార్యదర్శులు గ్రామాలలో ఉదయం పూటనే వెళ్లి పర్యవేక్షించాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు, గర్బిణికులకు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలని అన్నారు. గ్రామాలలో మంచి నీటి కొరత తీర్చేందుకు మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా చేయడం జరుగుతున్నదని, అట్టి సరఫరాలో అంతరాయం కలుగకుండా ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకుంటున్నారని, సర్పంచ్ లు, పంచాయితీ కార్యదర్శులు నీటి సరఫరాలలో అంతరాయం కలిగిన వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని అన్నారు. పంచాయితీ కార్యదర్శులు వారి పరిధిలోని గ్రామాలలో పల్లె నిద్ర చేయాలనీ అన్నారు. సర్పంచ్ లు గ్రామాలలో పచ్చదనం కోసం పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని, గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. జునోని గ్రామ సర్పంచ్ వివేక్ మాట్లాడుతూ, గ్రామంలో వీధి లైట్లు ఏర్పాటు చేయాలనీ కలెక్టర్ ను కోరారు. చాంద్ పల్లి సర్పంచ్ జంక్ష మాట్లాడుతూ, గ్రామాలలో పాడుబడిన విద్యుత్ ఇనుప స్తంభాలను మరచాలని, లూస్ వైర్లను సరి చేయాలనీ, ప్రతి రోజు మిషన్ భగీరథ నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ITDA బాలికల రెసిడెన్షియల్ పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మించాలని, పెండింగ్ లో ఉన్న అంగన్వాడీ భవన నిర్మాణాలను పూర్తిచేయాలని, గిరిజన గ్రామమైన చాంద్ పల్లి కి అన్ని సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ ను కోరారు. ఈ కార్యక్రమాలలో జడ్పీ సీఈఓ గణపతి, మండల ప్రత్యేక అధికారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడి శంకర్, ఎంపీడీఓ రవీందర్, తహసీల్దార్ రాంరెడ్డి, పంచాయితీ కార్యదర్శులు, తదితర శాఖల అధికారులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post