DPRO ADB- ప్రజాస్వామ్యంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలి- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్.

సువిశాల భారతదేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కు ఓటుహక్కు కీలకమైందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం రోజున కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో నిర్వహించిన 12వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఓటరుగా నమోదు అయిన వారందరు తమ వివరాలను ఓటర్ లిస్టులో సరిచుసుకోవాలని, 16, 17 సంవత్సరాల వయస్సు గల వారందరికీ ఎలక్టోరల్ విషయాలపైన అవగాహన కల్పించాలని, ఓటర్ గా నమోదు అయిన వారందరు నిస్పక్షపాతంగా నిర్భయంగా కుల, మతాలకు అతీతంగా ఓటుహక్కు వినియోగించుకోవాలని అన్నారు. ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని జిల్లాలో విస్తృత ప్రచారం నిర్వహించామని, జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలకు ఎన్నికల కమిషన్ గుర్తించిందని తెలిపారు. మన జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించి ఇతర జిల్లాల్లో అమలు పరచారని తెలిపారు. అంతకుముందు ఈ కార్యక్రమానికి హాజరైన ఉద్యోగులతో భారత దేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యం పై విశ్వాసంతో, మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను, స్వేచ్చాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామని, మతం, కులం, జాతి, వర్గం, బాషా, బేధాలు లేకుండా ప్రతి ఎన్నికలను నిర్భయంగా ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. SSR 2022 కార్యక్రమంలో పాల్గొన్న బూత్ స్థాయి అధికారులకు తహసీల్దార్లకు, నయాబ్ తహసిల్దార్లకు, జిల్లాలోని ఉన్నత పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాల అధ్యాపకుల సహకారం తో విద్యార్థులకు ఓటు హక్కు పై అవగాహన కల్పించి 18 ఏళ్ళు నిండిన యువత పేర్లను నమోదు చేయడం జరిగిందని అన్నారు. ఆదిలాబాద్, బోథ్ నియోజక వర్గాల పరిధిలోని 14 మండలాలలో గల 582 మంది బూత్ స్థాయి అధికారుల సేవలను కలెక్టర్ కొనియాడారు. స్వీప్ నోడల్ అధికారి బి. లక్ష్మణ్ సేవలను ఎన్నికల కమిషన్ గుర్తించి రాష్ట్ర స్థాయి నగదు పురస్కారానికి ఎంపిక చేయడం అభినందనీయమని అన్నారు. రానున్న రోజుల్లో ఆదిలాబాద్ జిల్లాలో అర్హులైన ఏ ఒక్కరు కూడా ఓటు హక్కు లేకుండా ఉండకూడదని, అందుకు సంబంధిత యంత్రాంగం కృషి చేయాలనీ అన్నారు. ఎన్నికల కమిషన్ చే ఉత్తమ నోడల్ అధికారిగా ఎంపిక చేసి నగదు పురస్కారాన్ని అందుకున్న చెక్కును జిల్లా కలెక్టర్ స్వీప్ నోడల్ అధికారి బి.లక్ష్మణ్ కు అందజేశారు. ఈ సందర్బంగా లక్ష్మణ్ మాట్లాడుతూ, తనకు సామజిక సేవ కల్పించిన జిల్లా కలెక్టర్ కు, ఎన్నికల కమిషన్ కు కృతఙ్ఞాతలు తెలిపారు. ఉత్తమ స్వీప్ నోడల్ అధికారిగా ఎంపిక చేసి అందించిన 15 వేల రూపాయలను తాను పనిచేస్తున్న యాపల్ గూడా ప్రభుత్వ పాఠశాలకు విరాళంగా ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. గతంలో ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికై 10 వేల రూపాయల నగదును కూడా అదే పాఠశాలకు అందించానని లక్ష్మణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్. నటరాజ్, ఆర్డీఓ రాజేశ్వర్, స్వీప్ కోర్ కమిటీ సభ్యులు ఎన్. భీమ్ కుమార్, కలెక్టరేట్ పరిపాలనాధికారి అరవింద్ కుమార్, కలెక్టరేట్ పర్యవేక్షకులు వర్ణ, నలంద ప్రియా, స్వాతి, రాజేశ్వర్, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share This Post