DPRO ADB – ప్రణాళికలతో వ్యాక్సిన్ పంపిణి సకాలంలో నిర్వహించండి- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్.

అర్హత గల వారందరికీ వాక్సిన్ అందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఈ నెల 22 తేదీ నాటికి లక్ష్యాలను సాధించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. శుక్రవారం రోజున ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వైద్య, పంచాయితీ అధికారులు, మున్సిపల్ కమీషనర్ లతో వ్యాక్సినేషన్ పై జిల్లాల వారీగా సమీక్షించారు. ఈ సందర్బంగా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, క్షేత్ర స్థాయిలో మండల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సబ్ సెంటర్, గ్రామాల వారీగా నోడల్ అధికారులను నియమించి కరోనా టీకా మందు తీసుకునే విధంగా ఆయా గ్రామాల ప్రజలను ప్రేరేపిస్తూ వ్యాక్సిన్ అందించే బాధ్యతలను అప్పగించాలని అన్నారు. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో వార్డుల వారీగా మెప్మా రిసోర్స్ పర్సన్ లను, వైద్య సిబ్బందికి బాధ్యతలు అప్పగిస్తూ అర్హత గల వారందరికీ వ్యాక్సిన్ అందించాలని అన్నారు. ఆయా గ్రామాలు, వార్డులలోని నోడల్ అధికారులు వారి పరిధిలో వందశాతం వ్యాక్సినేషన్ చేస్తాననే లక్ష్యంగా పని చేయాలనీ అన్నారు. ప్రజలకు నమ్మకం కలిగిస్తూ, ప్రేరేపిస్తూ వ్యాక్సిన్ పంపిణి నిర్వహించాలని అన్నారు. ప్రత్యేక అధికారులు, జిల్లా అధికారులు, కలెక్టర్లు గ్రామాలలో పర్యటించి వ్యాక్సిన్ పంపిణి విధానాన్ని పర్యవేక్షించాలని అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 17.6 లక్షల మందికి వ్యాక్సిన్ పంపిణి చేయాల్సి ఉందని వారందరికీ ఈ నెల 22 నాటికీ లక్ష్యాలను అధిగమించాలని అన్నారు. లక్ష్యాలకు అనుగుణంగా మంచిర్యాల, నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో రోజుకు 15 వేల చొప్పున, ఆదిలాబాద్ జిల్లాలో రోజుకు 20 వేల చొప్పున వ్యాక్సిన్ అందించాలని అన్నారు. ఓమిక్రాన్ థర్డ్ వేవ్ ప్రభలక ముందే రెండు డోసుల వ్యాక్సిన్ ను అందించాలని అన్నారు. రాష్ట్ర ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వి మాట్లాడుతూ, వ్యాక్సిన్ పంపిణి కార్యక్రమాన్ని వేగవంతం చేయాలనీ ఉదయం 8 నుండి రాత్రి 8 గంటల వరకు రెండు టీమ్ లుగా ఏర్పడి నిర్వహించాలని అన్నారు. వ్యాక్సినేషన్ పై విస్తృత ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని, స్థానికుల సహకారంతో లక్ష్యానికి అనుగుణంగా పంపిణి కార్యక్రమం చేపట్టాలని అన్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాస్ రావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో 91 శాతం మొదటి డోస్, 47 శాతం రెండవ డోస్ పంపిణి జరిగిందని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల జిల్లాలో మొదటి డోస్ 95 శాతం, రెండవ డోస్ 39 శాతం, నిర్మల్ జిల్లాలో మొదటి డోస్ 83 శాతం, రెండవ డోస్ 33 శాతం, ఆదిలాబాద్ జిల్లాలో మొదటి డోస్ 79 శాతం, రెండవ డోస్ 23 శాతం, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మొదటి డోస్ 77 శాతం, రెండవ డోస్ 16 శాతం పంపిణి జరిగిందని నివేదికల ఆధారంగా తెలియపరచడం జరిగిందని అన్నారు. అనంతరం మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్., నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషార్రఫ్ అలీ ఫారూఖీ, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ లు మాట్లాడుతూ, పీ.హెచ్.సి, సబ్ సెంటర్, హాబిటేషన్, పట్టణప్రాంతాలలో వార్డుల వారీగా ప్రత్యేక అధికారులను నియమించి ప్రజలను చైతన్య పరుస్తామని, పెన్షన్, నిత్యావసర సరుకుల పంపిణి కేంద్రాలకు వచ్చే లబ్ధిదారులకు వ్యాక్సినేషన్ పై అవగాహన కల్పిస్తామని తెలిపారు. మొబైల్ వాహనాల ద్వారా గ్రామాల్లో ప్రచారం నిర్వహించడం, కళాశాలల్లోని విద్యార్థులకు అవగాహన కల్పించడం, ఇంటింటికి వెళ్లి సర్వేతో పాటు అవగాహన కల్పించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిర్దేశించిన సమయం లోగా లక్ష్య సాధనకు చర్యలు చేపడతామని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో 40 శాతం గిరిజన ప్రాంతాలైనందున రాయి సెంటర్ ల సహకారం, తెలంగాణ సాంస్కృతిక సారథి బృందాలు, స్థానిక మీడియా, స్థానిక అల్ ఇండియా రేడియో, వివిధ భాషల్లో వాయిస్ మేసేజ్ ల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిస్తూ, అర్హులైన వారందరికీ వందశాతం వ్యాక్సిన్ అందిస్తామని తెలిపారు. అంతకు ముందు స్థానిక ఏరోడ్రమ్ లో ప్రభుత్వ కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులకు కలెక్టర్, ఎస్పీ రాజేష్ చంద్ర, ITDA ప్రాజెక్టు అధికారి అంకిత్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ లు పూల మొక్కలను అందించి స్వాగతం పలికారు. ఈ సమావేశంలో వైద్య విద్య సంచాలకులు రమేష్ రెడ్డి, ఓఎస్డి గంగాధర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల అదనపు కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, మున్సిపల్ కమీషనర్ లు, పంచాయితీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post