ప్రత్యేక ఓటర్ నమోదు, నూతన ఓటర్ జాబితా సవరణ- 2023 కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. శుకవారం రోజున జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా సీఈఓ మాట్లాడుతూ, స్పెషల్ సమ్మరి రివిజన్, నూతన ఓటర్ జాబితా సవరణ-2023 ప్రత్యేక కార్యక్రమాలలో భాగంగా ఈ నెల 26, 27 తదుపరి డిసెంబర్ 3, 4 తేదీలలో బూత్ స్థాయి అధికారులు వారి పోలింగ్ కేంద్రాలలో అందుబాటులో ఉండి ఓటర్ నమోదు, మార్పులు, చేర్పులు వంటి ఏర్పాట్లు చేపట్టాలని అన్నారు. బూత్ స్థాయి సూపర్ వైజర్లు, సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, నియోజక వర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు వారి పరిధుల లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటర్ నమోదు కార్యక్రమాలను పరిశీలించి జిల్లా ఎన్నికల అధికారికి నివేదికలు సమర్పించాలని అన్నారు. ఏ ఒక్కరు కూడా అర్హత గల వారు మిగిలిపోకుండా బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్ గా నమోదు చేయాలని అన్నారు. ఓటర్ నమోదు కార్యక్రమం పై గ్రామాలు, పట్టణాలలో విస్తృత ప్రచారం నిర్వహించాలని, స్థానిక మీడియా, సోషల్ మీడియా, ఆడియో వాయిస్ రికార్డింగ్ ల ద్వారా ప్రజలను చైతన్య వంతులను చేస్తూ అర్హత గల వారి పేర్లను ఓటర్ జాబితాలో నమోదు చేసుకునే విధంగా తెలియపరచాలని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి సిక్తా పట్నాయక్ అధికారులతో మాట్లాడుతూ, జిల్లాలోని బూత్ స్థాయి అధికారులు నిర్దేశించిన తేదీలలో ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కేంద్రాలలో ఉండి ఓటర్ నమోదు, మార్పులు, చేర్పులు చేపట్టాలని అన్నారు. బూత్ స్థాయి సూపర్ వైజర్లు వారి పరిధిలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి నివేదికలను సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు సమర్పించాలని, సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు వారి పరిధిలోని పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించి ఈఆర్ఓ లకు నివేదికలు అందించాలని, ఈఆర్ఓ లు జిల్లా ఎన్నికల అధికారికి నిర్ణిత రిపోర్ట్ అందజేయాలని అన్నారు. తప్పులులేని ఓటర్ జాబితా తయారు చేసేందుకు మరణించిన, శాశ్వతంగా వెళ్లిపోయిన వారి పేర్లను తొలగించాలని, ట్రాన్స్ జెండర్స్, సెక్స్ వర్కర్స్, కొత్తగా వివాహమైన మహిళలు, వికలాంగులు, ప్రముఖులు, ముఖ్యుల పేర్లు తప్పిపోకుండా తప్పని సరిగా నమోదు చేయాలనీ అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్, ఆర్డీఓ లు రమేష్ రాథోడ్, కదం సురేష్, స్వీప్ నోడల్ అధికారి లక్ష్మణ్, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలంద ప్రియా, సూపర్ వైజర్ లు, తదితరులు పాల్గొన్నారు.