DPRO ADB- ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా స్థాయి క్యాడర్ ఉద్యోగులకు ఈ నెలాఖరు నాటికీ పోస్టింగ్ ఉత్తర్వులు అందించాలి – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా స్థాయి క్యాడర్ ఉద్యోగులకు ఈ నెలాఖరు నాటికీ పోస్టింగ్ ఉత్తర్వులు అందించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని వివిధ శాఖాధిపతులతో స్థానిక క్యాడర్ నియామకానికి సంబందించిన విధివిధానాలను వివరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జిల్లా స్థాయి క్యాడర్ కేటాయింపుల ప్రక్రియ ముగిసిందని, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రాధాన్యత అంశం లను పరిగణలోకి తీసుకొని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు శాఖల వారీగా ఉద్యోగుల కేటాయింపు జరిగిందని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాకు కేటాయించబడిన ఉద్యోగుల సీనియారిటీ, పోస్టింగ్ లకు సంబంధించిన వివరాలను నిర్ణిత ప్రొఫార్మాలలో ఈ నెల 25 న ఆయా కార్యాలయాలలో ప్రదర్శించాలని అన్నారు. ఇతర జిల్లాల నుండి ఆదిలాబాద్ జిల్లాకు కేటాయించబడిన ఉద్యోగులకు పోస్టింగ్ ల నిమిత్తం ప్రభుత్వ ఉత్తర్వు నెంబర్ 317 లోని అంశాలను పరిగణలోకి తీసుకొని ఉద్యోగుల నుండి ప్రాధాన్యత లను నిర్ణిత ప్రొఫార్మాలో ఈ నెల 26, 27 తేదీలలో స్వీకరించాలని అన్నారు. అనంతరం ఈ నెల 28, 29 తేదీలలో జిల్లా కలెక్టర్ చైర్మన్, సంబంధిత శాఖల అధికారుల నేతృత్వంలో కమిటీ సమావేశం నిర్వహించి కొత్తగా కేటాయింపులు జరిగిన ఉద్యోగులకు పోస్టింగ్ ఉత్తర్వులు అందించాలని అన్నారు. ఈ నెలాఖరు లోగా ఉద్యోగులు వారికి అందించనున్న పోస్టింగ్ ఆర్డర్ల ప్రకారం విధుల్లో చేరవలసి ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో ITDA ప్రాజెక్టు అధికారి అంకిత్, అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్, ఆర్డీఓ రాజేశ్వర్, కలెక్టరేట్ పరిపాలనాధికారి అరవింద్ కుమార్, వివిధ శాఖల శాఖాధిపతులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post