DPRO ADB-ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ వైద్యాధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం రిమ్స్ సమావేశ మందిరంలో ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు అందుతున్న వైద్యసేవలు, సాధారణ ప్రసవాలకై తీసుకుంటున్న చర్యలపై వైద్యాధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా రిమ్స్ ఆసుపత్రిలో విభాగాల వారీగా అందిస్తున్న వైద్య సేవలపై చర్చించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక కేంద్రాలు, రిమ్స్ ఆసుపత్రి లలో ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించాలని ఆదేశించారు. సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాలని సూచించారు. ఏప్రిల్ లో 490, మే నెలలో ఇప్పటి వరకు 310 ప్రసవాలు జరిగాయని తెలిపారు. మాతా, శిశు సంరక్షణకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజలకు ప్రత్యేక వైద్య సదుపాయాలు కల్పించాలని అన్నారు. మెరుగైన వైద్యసేవలు అందించడం లో రాష్ట్రము లోనే ముందు వరసలో నిలిచేలా వైద్యాధికారులు కృషిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.నరేందర్ రాథోడ్, ఇతర డాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post