DPRO ADB-ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా- రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు.

ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా వైద్యాధికారులు కృషి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సోమవారం హైదరాబాదు నుండి జిల్లా కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు అందిస్తున్న వైద్యసేవలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని అన్నారు. ప్రతి ఆసుపత్రిలో పరిసరాల పరిశుభ్రతతో పాటు త్రాగునీరు అందుబాటులో ఉంచాలని, అవసరమైన మరమ్మత్తులు చేపట్టాలని అన్నారు. టి-డయాగ్నస్టిక్, ఆరోగ్య శ్రీ సేవలు అందించాలని, 108, 102 (అమ్మబడి) వాహనాల ద్వారా వైద్య సేవలు, వాటి పనితీరును నిరంతరం వైద్య అధికారులు పర్యవేక్షించాలని అన్నారు. రక్తహీనత లోపం కలిగిన గర్భిణీలకు, బాలింతలకు ప్రత్యేక వైద్య చికిత్సలతో పాటు పౌష్టికాహారం అందించాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచి, కెసిఆర్ కిట్ లను అందించాలని సూచించారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీసీ కెమెరా లను అమర్చాలని, అవుట్ పేషంట్ సంఖ్యను పెంచాలని, ఖాళీగా ఉన్న వైద్యాధికారుల పోస్ట్ లను వెంటనే భర్తీ చేయాలనీ అన్నారు. టీబీ, కిడ్నీ, తదితర రోగులకు నిరంతరం వైద్య సేవలు అందించాలని సూచించారు. కరోనా నేపథ్యంలో అర్హులైన వారికీ వందశాతం వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలిగేలా వైద్యసేవలు అందించాలని వైద్యాధికారులు, సిబ్బందికి సూచించారు. అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్ మాట్లాడుతూ, జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు నిరంతరం మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.నరేందర్ రాథోడ్, డిప్యూటీ వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డా.సాధన, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా.పవన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Share This Post