DPRO ADB- ప్రభుత్వ ఆసుపత్రుల్లో వంద శాతం ప్రసవాలు జరిగేలా వైద్యాధికారులు కృషి చేయాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వంద శాతం ప్రసవాలు జరిగేలా వైద్యాధికారులు కృషి చేయాలనీ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు అందుతున్న వైద్యసేవలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచాలని, అలాగే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారిగా గర్భిణీల సంఖ్యను గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా వైద్యాధికారులు, ఆశా, ANM లు సమన్వయంతో పని చేయాలనీ అన్నారు. రక్తహీనతతో బాధ పడుతున్న పిల్లలను, గర్భిణీలను, బాలింతలను గుర్తించి ప్రత్యేక వైద్య చికిత్సలతో పాటు పౌష్టికాహారం అందేలా చర్యలు చేపట్టాలని అన్నారు. రక్తహీనతను నివారించేందుకు గ్రామస్థాయి అధికారుల ఆధ్వర్యంలో పోషకాహార దినోత్సవం నిర్వహించాలని తెలిపారు. రక్త హీనత నియంత్రణకు తీసుకోవలసిన చర్యలు, కెసిఆర్ కిట్, ప్రభుత్వ ప్రోత్సాహకాల పై అవగాహన కల్పించాలని అన్నారు. జిల్లాలో 12 నుండి 14, 15 నుండి 18 సంవత్సరాల వయసు గల పిల్లలకు కోవిడ్ వ్యాక్సినేషన్ మొదటి డోసు వందశాతం పూర్తిచేయడం జరిగిందని, అలాగే రెండవ డోసును ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్య చికిత్సలు, కార్యక్రమాల వివరాలను ఆన్ లైన్ లో అప్ డేట్ చేయాలనీ అన్నారు. వైద్యాధికారులు బాధ్యతాయుతంగా పని చేసి ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలిగేలా వైద్య సేవలు అందించాలని అన్నారు. అనంతరం ఆసుపత్రుల్లో అందిస్తున్న వైద్య చికిత్సలు, రిజిస్ట్రేషన్ లు, తదితర అంశాలపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా చర్చించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ, వైద్యాధికారులు, సిబ్బంది ప్రజలతో మమేకమై ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యసేవలు అందించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.నరేందర్ రాథోడ్, డిప్యూటీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా.సాధన, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి శ్రీకాంత్, జిల్లా అనీమియా నియంత్రణ అధికారి డా.పవన్ కుమార్, వైద్యాధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share This Post