DPRO ADB- ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలి- జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్ధన్.

జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్ధన్ అన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్ కార్యాలయంలోని తన చాంబర్ లో నిర్వహించిన జడ్పీ స్థాయి సంఘ సమావేశాలలో ఆసిఫాబాద్ శాసనసభ్యులు ఆత్రం సక్కు తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలను వందశాతం అమలు చేస్తూ జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. ముఖ్యంగా వేసవి నేపథ్యంలో ప్రజలకు త్రాగునీరు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నీరు అందించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్లో త్రాగు నీటి వసతి కల్పించాలని అన్నారు. మిషన్ భగీరథ లో ఇప్పటివరకు త్రాగు నీరు అందని గ్రామాలను గుర్తించి వెంటనే పనులు పూర్తిచేసి ప్రతి ఇంటికి త్రాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన సి సి రోడ్డు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని అన్నారు. మన ఊరు మన బడి కింద ఎంపికైన ప్రభుత్వ పాఠశాలలో త్రాగు నీరు, డైనింగ్ హల్, కాంపౌండ్ వాల్, మరుగుదొడ్లు తదితర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, రిమ్స్, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోనూ ఖాళీగా ఉన్న వైద్యులు సిబ్బంది పోస్టుల భర్తీకి త్వరితగతిన చర్యలు చేపట్టాలని రైమ్స్ డైరెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఆసిఫాబాద్ శాసనసభ్యులు ఆత్రం సక్కు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి మానసపుత్రిక అయినటువంటి మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి త్రాగు నీరు అందించాలని అన్నారు. ముఖ్యంగా నార్నూర్, గాదిగూడ మండలలోని గిరిజన గ్రామాలు, తండాలలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. దళిత బంధు పథకం లబ్ధిదారుల యూనిట్లను వెంటనే గ్రౌండింగ్ చేయాలని అన్నారు. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖలు ఇప్పటి వరకు సాధించిన పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో చర్చించారు. ఈ సమావేశాల్లో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి గణపతి, డిఆర్డిఓ కిషన్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. నరేందర్, రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జైసింగ్, జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి సంధ్యారాణి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, ఇంజనీరింగ్ శాఖల అధికారులు మహావీర్, వెంకటేశ్వర్లు, సురేష్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, ఎస్సీ అభివృద్ధి అధికారి సునీత, మార్కెటింగ్ ఎడి శ్రీనివాస్, ఇతర శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post