DPRO ADB- బడి ఈడు పిల్లలు వంద శాతం పాఠశాలల్లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలి- ఆదిలాబాద్ శాసన సభ్యులు జోగు రామన్న.

బడి ఈడు పిల్లలు వంద శాతం పాఠశాలల్లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ శాసన సభ్యులు జోగు రామన్న అన్నారు. సోమవారం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల దస్నాపూర్ (సరస్వతి నగర్) లో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు. ముందుగా విద్యార్థులు, అధికారులతో బడి బాట కార్యక్రమం పై కాలనీ విధుల గుండా పాదయాత్ర నిర్వహించి అవగాహన కల్పించారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో శాసన సభ్యులు మాట్లాడుతూ, బడి ఈడు పిల్లలందరిని తప్పనిసరిగా పాఠశాల చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో డ్రాప్ అవుట్ పిల్లలను గుర్తించి, సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు మధ్యాహ్న భోజనం అందించడం జరుగుతుందన్నారు. విద్యా సంవత్సరంలో ప్రతి విద్యార్థికి రెండు జతల చొప్పున డ్రెస్ లు, పుస్తకాలను పంపిణి చేయడం జరుగుతుందన్నారు. ప్రత్యేక డ్రైవ్ లో తల్లిదండ్రులను భాగస్వాములను చేసి, బడి ఈడు పిల్లలను గుర్తించడంలో ప్రజా ప్రతినిధులు, చైల్డ్ లైన్ ప్రతినిధులు, అంగన్వాడి, స్వచ్చంద సంస్థల సహకారం తీసుకోవాలని అన్నారు. బడిబాట కార్యక్రమం పూర్తయ్యేలోపు బాల కార్మికులు లేకుండా చూడాలని సూచించారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చి దిద్దెందుకు మన ఊరు- మన బడి కార్యక్రమం లో భాగంగా జిల్లాలో మొదటి విడతగా 237 పాఠశాలలను ఎంపిక చేసి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ వసతి గృహాల్లో మెరుగైన సౌకర్యాల కల్పన, భవనాల మరమ్మతులను చేపట్టడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు బడి బాట కార్యక్రమంపై పాటల రూపంలో అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారిణి ప్రణీత, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post