బతుకమ్మ వేడుకలను సంప్రదాయబద్దంగా ఆనందోత్సాహాలతో నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం రోజున స్థానిక సఖి కేంద్రం ఆవరణలో స్త్రీ శిశు, మహిళా, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా బతుకమ్మ వేడుకలను కలెక్టర్ ప్రారంభించారు. తొలుత అంగన్వాడీ కార్యకర్తలు వండిన సాంప్రదాయ వంటలు, కూరగాయలు, విత్తనాలతో తయారు చేసిన బతుకమ్మలను కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ లు పరిశీలించి, బాలామృతం తో తయారుచేసిన పదార్థాలు, పిండి వంటలను రుచి చూశారు. అనంతరం బతుకమ్మ కు పూజ కార్యక్రమాలు నిర్వహించి బతుకమ్మ, కోలాటం ఆటలను ఆడారు. తదుపరి అక్టోబర్ 1 న అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్బంగా గోడప్రతులను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా 10 రోజుల పాటు మహిళలు బతుకమ్మ ఆట,పాటలను సాంప్రదాయ రీతిలో నిర్వహించాలని, ప్రభుత్వ పరంగా నేటి నుండి బతుకమ్మ వేడుకలను ప్రారంభించుకోవడం జరిగిందని అన్నారు. జిల్లాలో 2.61 లక్షల బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కలెక్టర్, అదనపు కలెక్టర్ లు బతుకమ్మ ఆటలను మహిళలు, పిల్లలతో కలిసి ఆడారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, జిల్లా సంక్షేమ అధికారులు మిల్కా, కృష్ణవేణి, సునీత కుమారి, భూగర్భ జల సహాయ సంచాలకులు శ్రీవల్లి, జిల్లా విద్యాశాఖ అధికారిణి ప్రణీత, రెవెన్యూ, అంగన్వాడీ, సఖి కేంద్రం సిబ్బంది, మహిళలు, విద్యార్థులు పిల్లలు, వయోవృద్ధులు, తదితరులు పాల్గొన్నారు.