DPRO ADB-“బాలల కోసం పీఎం కేర్స్” పథకం పాస్ బుక్, ఆయుష్మాన్ భారత్ – ప్రధానమంత్రి జనారోగ్య యోజన కార్డును పిల్లలకు అందజేసిన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన “బాలల కోసం పీఎం కేర్స్” పథకం ప్రవేశ పెట్టడం జరిగిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సోమవారం ఢిల్లీ నుండి అన్ని జిల్లా కలెక్టర్ల తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో “బాలల కోసం పీఎం కేర్స్” పథకం కింద ప్రయోజనాలను ప్రధాన మంత్రి విడుదల చేసారు. ఈ సందర్బంగా ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ప్రాణాంతకమైన కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమకు ఎంతో సన్నిహితులైన వారిని కోల్పోయారని, మహమ్మారి వలన తల్లిదండ్రులను కోల్పోవడం అత్యంత బాధకమన్నారు. అలాంటి పిల్లలకు పీఎం కెర్స్ పథకం ప్రయోజనాలు అందాలన్నారు. 2020 మార్చి 11 నుంచి 2022 ఫిబ్రవరి 28 మధ్య అనాథలైన బాలలు ఈ పథకం కింద లబ్ధి పొందడానికి అర్హులని తెలిపారు. అటువంటి పిల్లలకు సమగ్ర సంరక్షణ, భద్రతతోపాటు భోజన, నివాస సౌకర్యం కల్పించడం ఈ పథకం లక్ష్యమని, తద్వారా ఉపకార వేతనం, విద్యాభ్యాసం ద్వారా వారికి సాధికారత కల్పిస్తామన్నారు. ఇందుకోసం బాలలకు 23 సంవత్సరాలు వచ్చేదాకా రూ.10 లక్షల నిధి సమకూరుతుందని, వారి శ్రేయస్సు కోసం ఆరోగ్య బీమా కూడా కల్పిస్తుందన్నారు. ఈ పథకం కింద బాలలు తమ పేర్లు నమోదు చేసుకోవడం కోసం pmcaresforchildren.in పోర్టల్ ఏర్పాటు చేయబడిందని తెలిపారు. ఉన్నత విద్యాభ్యాసానికి విద్యారుణ సదుపాయం కల్పిస్తుందని, ఈ రుణం వడ్డీ భారాన్ని పిఎం కేర్స్ భరిస్తుందన్నారు. 23 సంవత్సరాల వయసు వరకు ఆయుష్మాన్ భారత్ యోజన కింద రూ.5 లక్షల ఆరోగ్య బీమాతో పాటు ఆరోగ్య బీమా ప్రీమియం సిఎం కేర్స్ భరిస్తుందని అన్నారు. 18 సంవత్సరాల వయసు వరకు వ్యక్తిగత అవసరాలకు నెలవారీ ఆర్థిక సహాయం, 23 సంవత్సరాల వయసు నిండిన వెంటనే పిఎం కేర్స్ నుంచి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందుతుందన్నారు. 1-12 తరగతుల మధ్యన పిల్లలకు ఏడాదికి రూ.20,000 స్కాలర్ షిప్, టెక్నికల్ విద్యకు స్వనత్ స్కాలర్ షిప్, 50 వేల ఎక్స్ గ్రేషియా చెల్లించడం జరుగుతుందన్నారు. 100 సంవత్సరాల క్రితం మా కుటుంబం కూడా ఇటువంటి విషాదం చవి చూసిందని, సరిగ్గా వంద సంవత్సరాల క్రితం ఇదే తరహాలో భయంకరమైన మహమ్మారి కోరల్లో ప్రపంచం చిక్కుకున్న సమయంలో నా తల్లి తన మాతృమూర్తిని అంటే మా అమ్మమ్మని కోల్పోయిందన్నారు. తల్లిదండ్రులు సజీవంగా ఉండడం పిల్లలకు ఎప్పుడూ అతి పెద్ద అండ అని, నేడు వారు లేని ఈ సమయంలో పిల్లల బాధ్యతలు గతం కన్నా ఎంతగానో పెరిగాయన్నారు. వారి జీవితంలో ఏర్పడిన లోటును భర్తీ చేయడం ఎవరి వల్ల సాధ్యం కాదని, బాలల బంగారు భవిష్యత్తును ఆకాంక్షిస్తూ దేశం వేసిన ముందడుగే బాలల కోసం పిఎం కేర్స్ పథకం అన్నారు. పిల్లల కలలు సాకారం చేయడంలో సహాయం చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని ఈ పథకం భరోసా ఇస్తుందని, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు. అనంతరం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ “బాలల కోసం పీఎం కేర్స్” పథకం పాస్ బుక్, ఆయుష్మాన్ భారత్ – ప్రధానమంత్రి జనారోగ్య యోజన కార్డు, స్నేహపాత్ర సర్టిఫికెట్ ను పిల్లలకు అందజేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, సంక్షేమ అధికారి మిల్కా, బాలల సంరక్షణ అధికారి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post