DPRO ADB- మోటివేట్ చేస్తూ, ప్రోత్సహిస్తూ వ్యాక్సిన్ అందిస్తున్నాం- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

జిల్లాలో ఏ ఒక్కరు కూడా వ్యాక్సిన్ తీసుకుకోకుండా ఉండకూడదనే ఉద్దేశంతో ప్రజల వద్దకే టీమ్ లు వెళ్లి వ్యాక్సిన్ అందించడం జరుగుతున్నదని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం రోజున పట్టణంలోని పలు వార్డులలో వ్యాక్సినేషన్ నిర్వహణ తీరును అదనపు కలెక్టర్ తో కలిసి పరిశీలించారు. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని 28, 29, 30, 31 వార్డులలో వ్యాక్సిన్ తీసుకోని వారి ఇంటికి వెళ్లి వైరస్ వ్యాప్తిపై వివరించడం, వ్యాక్సిన్ పై ఉన్న అపోహలను స్వయంగా కలెక్టర్ నివృత్తి చేస్తూ, వ్యాక్సిన్ తీసుకునే విధంగా ప్రోత్సహించారు. ఎలాంటి దీర్ఘ కాళికా వ్యాధులు ఉన్నవారు, బాలింతలు, గర్భవతులు కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చని వైద్యాధికారులు, వైద్య, మున్సిపల్ సిబ్బంది ఆయా వార్డులోని ప్రజలకు వివరించడం జరుగుతుంది. ఈ సందర్బంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటివరకు 3.50 లక్షల (76%) మందికి వ్యాక్సిన్ అందించడం జరిగిందని, మిగిలిన 24 శాతం మందికి మొదటి డోస్ అందించేందుకు డోర్ టూ డోర్ సర్వే చేస్తూ అవగాహన కల్పిస్తూ వ్యాక్సిన్ అందించడానికి టీమ్ లు నేటి నుండి పని చేస్తున్నాయని తెలిపారు. ఇప్పటివరకు అర్హత కలిగిన 15 మందికి రెండవ డోస్ ఇవ్వాల్సి ఉందని, వారికీ కూడా పంపిణి జరుగుచున్నదని తెలిపారు. ఓమైక్రాన్ కొత్త వేరియంట్ వస్తుందనే ముందస్తులో భాగంగా జిల్లాలోని ప్రజలందరికి వ్యాక్సిన్ పంపిణి కార్యక్రమాన్ని ఈ నెల 31 లోగా అందించేందుకు జిల్లా యంత్రాంగం సీనియర్ అధికారులతో టీమ్ లను ఏర్పాటు చేయడం, పర్యవేక్షించడం జరుగుచున్నదని తెలిపారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకునే విధంగా అవగాహన కల్పిస్తున్నామని, స్థానిక ప్రజాప్రతినిధులు, వార్డ్ కౌన్సిలర్ లు, ఆయా వార్డులోని ప్రజలను చైతన్య పరచి వ్యాక్సిన్ తీసుకునే విధంగా జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు. డబుల్ వ్యాక్సిన్ ప్రతి ఒక్కరు తీసుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని, సామజిక దూరం పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, మున్సిపల్ కమీషనర్ శైలజ, ప్రత్యేక అధికారులు, వైద్య, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share This Post