DPRO ADB-రిమ్స్ ఆసుపత్రిలో మౌళిక సదుపాయాల కల్పనకు చర్యలు- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాలోని ప్రజలకు తక్షణ వైద్యసేవలు అందించేందుకు రిమ్స్ ఆసుపత్రి అత్యవసరమని, మౌళిక సదుపాయాల కల్పనకు జిల్లా యంత్రాంగం సహకరిస్తుందని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం రోజున రిమ్స్ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిన్న పిల్లల వార్డు, ఐసియు, గైనిక్ వార్డు, టి-హబ్ ను కలెక్టర్ పరిశీలించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై వారి బంధువులను అడిగి తెలుసుకున్నారు. చికిత్సలు పొందుతున్న రోగులతో వారి ఆరోగ్య విషయం, ఎక్కడి నుండి వచ్చారు అనే విషయాలను డాక్టర్ లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా రోగులతో మాట్లాడుతూ, ప్రస్తుత ఆరోగ్య విషయాలను, చికిత్సలు, భోజన సరఫరా లపై అడిగి తెలుసుకున్నారు. వార్డులలో నిరంతర పారిశుద్యం చేపట్టాలని రిమ్స్ డైరెక్టర్ ను ఆదేశించారు. ఈ సందర్బంగా మీడియా తో మాట్లాడుతూ, ఉమ్మడి జిల్లా కేంద్రంలో రిమ్స్ ఆసుపత్రిలో రోగులకు అత్యవసర వైద్య సేవలు అందిస్తున్న దృష్ట్యా ఆసుపత్రిలో మౌళిక సదుపాయాల కల్పనకు జిల్లా యంత్రాంగం సహకరిస్తుందని అన్నారు. సిటీ స్కాన్ మరమ్మతులు చేపట్టి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. ఆసుపత్రిలోని లిఫ్ట్ లను మరమ్మత్తులు చేయడానికి గతంలో ఉన్న పెండింగ్ బిల్లులు చెల్లించి మరమ్మతులు చేపట్టడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం టి-హబ్ ను పరిశీలించి పరీక్షల నిర్వహణ, రిపోర్ట్ లు పంపించే వివరాలు, తదితర వివరాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, పర్యవేక్షకులు డా.అశోక్, డాక్టర్లు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share This Post