DPRO ADB -లక్ష్యానికి అనుగుణంగా వ్యాక్సిన్ అందించాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ప్రజల సహకారంతోనే ప్రభుత్వం చేపట్టే ఏ కార్యక్రమమైనా విజయవంతం అవుతుందని, ప్రస్తుతం కోవిడ్ థర్డ్ వేవ్ ముప్పునుండి కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం రోజున ఉదయం ఆదిలాబాద్ పట్టణంలోని తిరుపల్లి, బడక మొహల్లా, మహా లక్ష్మీవాడ, జైజవాన్ నగర్, తాటిగూడ కాలనీలు, వార్డులలో కలెక్టర్ పర్యటించి వ్యాక్సినేషన్ పై పర్యవేక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఓమిక్రాన్ వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని అన్నారు. వ్యాక్సిన్ పై ఉన్న అపోహలను మున్సిపల్, మెప్మా, వైద్య, పంచాయితీ, ప్రత్యేక అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఆయా ప్రజలకు నివృత్తి చేస్తూ జిల్లాలో వందశాతం వ్యాక్సినేషన్ జిల్లాగా ప్రకటించుటకు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు. ఆదిలాబాద్ పట్టణంలో 49 వార్డులోని 178 కాలనీలు, గ్రామీణ ప్రాంతంలో 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 126 ప్రాథమిక ఉప కేంద్రాల పరిధిలోని ప్రతి వార్డు/ కాలనీ, గ్రామం లోని అర్హులైన వారందరికీ వ్యాక్సిన్ అందించాలని అన్నారు. ప్రతి కాలనీలో, ప్రతి సబ్ సెంటర్ లో రోజుకు వంద మందికి వ్యాక్సిన్ అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి రోజు టీమ్ లు ఉదయం 8 గంటల వరకు వారికీ కేటాయించిన కాలనీలు, గ్రామాలకు వెళ్లి ప్రజలకు చైతన్య వంతులను చేస్తూ, ప్రేరేపిస్తూ, అవగాహన కల్పిస్తూ వ్యాక్సినేషన్ జరగాలని సూచించారు. ఒకటికి రెండు సార్లు, మూడు సార్లు, నాలుగు సార్లు పదేపదే ఆయా ఇండ్లకు వెళ్లి వ్యాక్సిన్ తీసుకునే వరకు అవగాహన కల్పించాలని, అందుకు స్థానిక యంత్రాంగం గ్రామ, వార్డ్, కాలనీ పెద్దలు, ప్రముఖుల సహకారం తీసుకోవాలని అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చెత్త సేకరణకు వెళ్లే ట్రాక్టర్లు, ఇతర వాహనాల ద్వారా విస్తృత వాయిస్ మెసేజ్ ల ద్వారా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. గిరిజన ప్రాంతాలలోని రాయి సెంటర్ పెద్దలు, కమ్యూనిటీ కో-ఆర్డినేటర్ల సహకారం తీసుకోవాలని సూచించారు. కాలనీలు, గ్రామాలలో వందశాతం వ్యాక్సిన్ జరిగినట్లు ధ్రువీకరణ పత్రము ఆయా టీమ్ లు సమర్పించాలని, తద్వారా గ్రామ, మండల, వార్డుల ప్రత్యేక అధికారులు ఆయా కాలనీలను, గ్రామాలను సందర్శించి విచారణ చేపట్టి వందశాతం గ్రామాలు, వార్డులు, కాలనీలుగా ప్రకటించాలని అన్నారు. వచ్చే 20 రోజుల్లోగా రోజుకు 20 వేల చొప్పున జిల్లా వ్యాప్తంగా వ్యాక్సినేషన్ నిర్వహించే దిశాగా అధికార యంత్రాంగం ప్రత్యేక చొరవ చూపాలని ఆదేశించారు. ఈ పర్యటనలో మున్సిపల్ కమీషనర్ శైలజ, ప్రత్యేక అధికారులు, మెప్మా, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share This Post