DPRO ADB – లక్ష్యానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానంతో నర్సరీలలో మొక్కలను పెంచాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ప్రతిష్టాత్మక కార్యక్రమాలను జిల్లాలో వందశాతం అమలు పరచేవిధంగా యంత్రాంగం పనిచేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం రోజున స్థానిక దుర్గానగర్ అటవీ శాఖ నర్సరీలో గ్రామపంచాయితీ స్థాయిలో నర్సరీల ఏర్పాటు, మొక్కల పంపకం, నిర్వహణాలపై రెండు రోజుల పాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను గ్రామపంచాయితీలు, హాబిటేషన్లలో నిర్వహిస్తున్నామని తెలిపారు. హరితహారం పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, జాతీయ రహదారులకు ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్ వంటి కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. అలాగే ప్రతి గ్రామపంచాయితీలో నర్సరీని ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నామని తెలిపారు. ఈ సంవత్సరం జిల్లాలోని అన్ని గ్రామపంచాయితీలలో మంచి నర్సరీలను ఏర్పాటు చేసి అవసరమైన మొక్కలను పెంచాలని అన్నారు. గ్రామాలలో పంచాయితీ కార్యదర్శుల ద్వారా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, వ్యాక్సినేషన్, పోడుభూములకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అటవీ శాఖ, ఉద్యాన శాఖ, అధికారుల సహకారంతో, వనసేవకుల సూచనలతో మంచి మొక్కలను నాటాలని అందుకు కావలసిన శిక్షణాలను రెండు రోజుల పాటు క్షేత్ర సిబ్బందికి అందిస్తున్నామని తెలిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ, గతంలో నర్సరీలలో పెంచిన మొక్కలు సాంకేతిక మెళుకువలు పాటించకపోవడం వలన మొక్కల ఎదుగుదల జరగలేదని అన్నారు. ఈ సంవత్సరం జిల్లాలో 52 లక్షల మొక్కల పెంపకం చేపట్టడానికి లక్ష్యం గా నిర్ణయించడం జరిగిందని అన్నారు. మొట్టమొదటి సరిగా వనసేవకులను గుర్తించి వారిసేవలను వినియోగించుకుంటున్నామని తెలిపారు. గ్రామస్థాయి అధికారులు మొక్కల పెంపకం పై అవగాహన కల్పించడానికి, విజ్ఞానాన్ని సముపార్జించడానికి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అన్నారు. స్థానిక మట్టి నేలలను బట్టి అటవీ, ఉద్యానవన అధికారుల సహకారంతో నర్సరీలను నిర్వహించాలని అన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్ మాట్లాడుతూ, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని విత్తన సేకరణ చేపట్టడం జరుగుతుందని తెలిపారు. వందశాతం మొక్కల ఎదుగుదలకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అనంతరం స్థానిక అటవీ రేంజ్ అధికారి గులాబీ సింగ్ మొక్కల పెంపకం, నర్సరీల ఏర్పాటు అంశాలపై క్షేత్ర సమాచారాన్ని క్షేత్ర అధికారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్ రాథోడ్, ఎంపీడీఓ లు, ఎపిఓలు, సాంకేతిక సహాయకులు, పంచాయితీ కార్యదర్శులు, వన సేవకులు, అటవీ శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share This Post