DPRO ADB -వయసుకు తగిన బరువు, ఎత్తు లోపం తో ఉన్న పిల్లలకు సరైన వైద్య చికిత్సలతో పాటు పౌష్టికాహారం అందించాలి – ప్రభుత్వ వసతి గృహాల్లో ప్రవేశాలను పూర్తిచేయాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

వయసుకు తగిన బరువు, ఎత్తు లోపం తో ఉన్న పిల్లలకు సరైన వైద్య చికిత్సలతో పాటు పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. బుధవారం మహిళా, శిశు సంక్షేమ శాఖ ద్వారా అమలవుతున్న పథకాలు, కార్యక్రమాల పురోగతిపై సీడీపీఓలు, సూపర్ వైజర్ లతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, వయసుకు తగిన బరువు, ఎత్తు లోపం తో ఉన్న పిల్లలకు, రక్త హీనతతో బాధ పడుతున్న బాలింతలకు, గర్భిణీలకు అనుబంధ పోషకాహారం అందేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ఇప్పటి వరకు మండల కేంద్రాలలో పోషకాహార దినోత్సవాలు నిర్వహించి, సంబంధిత శాఖల అధికారులకు, ప్రజాప్రతినిధులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. సర్పంచ్ లు, పంచాయితీ కార్యదర్శుల సహకారంతో సంక్షేమ శాఖ సూపర్ వైజర్లు, సీడీపీఓ లు గ్రామాల వారిగా పోషకాహార దినోత్సవాలు నిర్వహించి పర్యవేక్షించాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల వారిగా తీవ్ర లోపం కలిగిన పిల్లలకు పౌష్టికాహారం తో పాటు బాలామృతం అందించాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు పౌర సరఫరాల శాఖ ద్వారా నిర్దేశించిన సమయంలోగా ప్రతినెలా సరుకులు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల వారీగా బియ్యం, గుడ్లు, పాలు, తదితర వాటి నిలువలు, ఖర్చుల వివరాలను పక్కాగా రిజిస్టర్ లో నమోదు చేయాలనీ సూచించారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలలోని అంగన్వాడీ కేంద్రాల వారిగా టీచర్ లకు, తల్లిదండ్రులకు పౌష్టికాహారం అందించేలా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.
అనంతరం షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ తో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ, ప్రభుత్వ షెడ్యూల్డు కులాల వసతి గృహాలలో జూన్ మొదటి వారం లోగా విద్యార్థులు ప్రవేశాలను పూర్తిచేయాలని అన్నారు. జిల్లాలో 19 ప్రీ-మెట్రిక్ వసతి గృహాలలో 2100 మంది, 3 పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలలో 300 మంది బాలబాలికలకు వసతి కల్పించడం జరుగుతుందని తెలిపారు. సంక్షేమ శాఖల అధికారులు గ్రామీణ ప్రాంత విద్యార్థులు ప్రభుత్వ వసతి గృహాల్లో చేరేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, అవసరమైన సహాయసహకారాలు అందించాలని అన్నారు. ఈ సమావేశాలలో అదనపు కలెక్టర్లు రిజ్వాన్ బాషా షేక్, ఎన్.నటరాజ్, ఆర్డీఓ రాథోడ్ రమేష్, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.నరేందర్ రాథోడ్, జిల్లా షెడ్యూల్డు కులాల సంక్షేమ అధికారి సునీత కుమారి, జిల్లా పౌర సరఫరాల అధికారి సుదర్శన్, సీడీపీఓలు, సూపర్ వైజర్లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post