DPRO ADB-వయోవృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు తోడ్పాటును అందిస్తుంది- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

వయోవృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు తోడ్పాటును అందిస్తున్నదని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం రోజున జడ్పీ సమావేశ మందిరంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, వయోవృద్ధుల వారోత్సవాల సందర్బంగా ర్యాలీలు, నడక, పరుగు వంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగిందని, ఈ అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్బంగా పలువురిని సన్మానించడం జరుగుతుందని తెలిపారు. వయోవృద్ధుల సమస్యలు తీర్చేందుకు జిల్లా యంత్రాంగం తోడ్పాటు అందిస్తుందని అన్నారు. వయోవృద్ధుల సమస్యలు జిల్లా సంక్షేమాధికారి లేదా రెవెన్యూ డివిజనల్ అధికారి లకు విజ్ఞాపన అందించవచ్చని తెలిపారు. జిల్లాలోని వయోవృద్ధుల భవన నిర్మాణానికి భూమిని కేటాయించాలని ఆర్డీఓ ను ఆదేశించారు. ఆదిలాబాద్ శాసన సభ్యులు జోగు రామన్న మాట్లాడుతూ, వృద్ధాప్యం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో రావడం జరుగుతుందని, వారి జీవిత కాలంలో చేసిన పనులు చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. వృద్దులకు సీనియర్ సిటిజన్ కార్డులను అందించడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో 37,576 మందికి వృద్ధాప్య ఫించన్ ల క్రింద ప్రతి నెల 75 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తున్నదని తెలిపారు. వృద్దులకు ప్రత్యేక సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తున్నదని అన్నారు. వయోవృద్ధుల సంరక్షణ కోసం చట్టాలు రూపొందించి అమలు పరుస్తున్నామని తెలిపారు. వయోవృద్ధుల భవనం కోసం భూ సమస్యను పరిష్కరించి భవన నిర్మాణానికి సహకరిస్తామని అన్నారు. జిల్లా సంక్షేమ అధికారిణి మిల్కా మాట్లాడుతూ, వృద్ధులతోనే కుటుంబం ఉంటుందని, అలాంటి పెద్దల నుండి నేర్చుకోవలసింది చాలా ఉందని అన్నారు. పెద్దల పట్ల వినయవిధేయతలు కలిగి ఉండే విధంగా అవగాహన కల్పించాలని అన్నారు. కుటుంబ సమస్యలు ఉత్పన్నమైనపుడు స్థానిక ఆర్డీఓ లను సంప్రదించాలని కోరారు. వయోవృద్ధుల సంక్షేమ జిల్లా అధ్యక్షులు దేవిదాస్ దేశ్ పాండే మాట్లాడుతూ, సమాజంలో తల్లిదండ్రుల పట్ల ప్రేమానురాగాలు కలిగి ఉండాలని అన్నారు. వయోవృద్ధుల సంఘంలో చాలామంది సభ్యత్వం తీసుకుంటున్నారని అన్నారు. వృద్ధుల కోసం చేపట్టే కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేస్తున్నామని అన్నారు. సంఘ భవనానికి భూమి కేటాయించి భవన నిర్మాణం చేపట్టాలని కోరారు. భారత ఎన్నికల కమిషన్ జారీ చేసిన లేఖలను వయోవృద్ధులకు కలెక్టర్, ఆర్డీఓ లు అందజేశారు. అనంతరం వయోవృద్ధుల దినోత్సవం సందర్బంగా వయోవృద్ధులను పూలమాల, శాలువా, మెమొంటో లతో సత్కరించారు. టోల్ ఫ్రీ కి సంబంధించిన బ్యాండ్ లను వృద్దులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమేష్ రాథోడ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.నరేందర్ రాథోడ్, జిల్లా విద్యా శాఖ అధికారిణి ప్రణీత, వయోవృద్ధుల సంక్షేమ సంఘం ప్రతినిధులు సుధాకర్, లింగారెడ్డి, దేవన్న, తదితరులు పాల్గొన్నారు.

Share This Post