DPRO ADB-వసతి గృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

వసతి గృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం రోజున స్థానిక బంగారుగూడ లోని తెలంగాణ మైనారిటీ సంక్షేమ వసతి గృహంలో జిల్లాలోని సంక్షేమ శాఖల వసతి గృహాలు, కేజీబీవీ విద్యాలయాలు, మహాత్మా జ్యోతి బా ఫులే, తదితర హాస్టళ్ల భోజన తయారీ సిబ్బంది, సంక్షేమ అధికారులకు ఓరియెంటేషన్, శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులకు అందిస్తున్న భోజనం శుచి, రుచి కలిగి ఉండాలని, నాణ్యత ప్రమాణాలతో తయారు చేయాలనీ అన్నారు. వంటల తయారీ చేయడంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, సరుకులను శుభ్రపరచుకోవాలని, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు వహించాలని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం ద్వారా విద్యార్థుల ఎదుగుదల, చురుకుదనం, మంచి విద్యను అభ్యసిస్తారని అన్నారు. ప్రతి వసతి గృహంలో మోడల్ స్టోర్ రూమ్ తయారుచేసుకోవాలని సూచించారు. ఈ సెలవుల కాలంలో ఏమైనా మార్పులు ఉన్నట్లయితే చేసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 350 మంది భోజన తయారీ దారులకు అవగాహన, శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ, భోజన తయారు సిబ్బందిపై ఎలాంటి ఫిర్యాదులు రాకుండా పిల్లల ఆరోగ్యం, భోజనం పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. టీమ్ వర్క్ తో పని చేసి విద్యార్థులకు మంచి భోజనం అందించాలని అన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని కుక్ లకు సూచించారు. ఈగలు, దోమలు, ఎలుకలు రాకుండా వంటగదులను, స్టోర్ రూమ్ లను శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. బియ్యం, కూరగాయలు, సరుకులను సక్రమంగా నీటితో కడిగి వంటకు వినియోగించాలని అన్నారు. ప్రణాళికలతో వంటలు తయారు చేసి శుభ్రమైన, రుచికరమైన భోజనాలు విద్యార్థులకు పంపిణీ చేయాలనీ అన్నారు. జిల్లాలోని సంక్షేమ హాస్టల్ ల కుక్ లకు, సిబ్బందికి అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా వసతి గృహాల్లో మార్పు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. శిక్షణలో తీసుకోవలసిన జాగ్రత్తలు, పాటించవలసిన నిబంధనలపై చెక్ లిస్ట్ అందజేయడం జరుగుతుందని తెలిపారు. సంక్షేమ వసతి గృహాల్లో భోజన విషయాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సంక్షేమ అధికారులు పర్యవేక్షించాలని అన్నారు. అనంతరం వంట గదులను, భోజన తయారీని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ శాఖల అధికారులు కృష్ణవేణి, సునీతకుమారి, రాజలింగు, సంక్షేమ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post