కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు విద్యను అందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మంగళవారం రోజున తలమడుగు మండలం సాయిలింగి గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ పాఠశాల లను ఆయన సందర్శించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులకు మంచి భోజనం, వసతి సౌకర్యాలు కల్పించాలని అన్నారు. ప్రస్తుతం వర్షాకాల నేపథ్యంలో వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు విద్యార్థుల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. కేజీబీవీ లోని స్టోర్ రూమ్ లో నిల్వ ఉన్న నిత్యావసర సరుకులు, గుడ్లు, తదితర సామాగ్రిని అదనపు కలెక్టర్ పరిశీలించారు. నాణ్యమైన గుడ్లను విద్యార్థులకు అందించాలని, చిన్న సైజు, నాసిరకం గుడ్లను తిరిగి కాంట్రాక్టర్ కు పంపించాలని అన్నారు. నాసిరకం గుడ్లను విద్యార్థులకు అందించకూడదని తెలిపారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో ఆయన ముచ్చటిస్తూ, మంచి విద్యాభ్యాసం అభ్యసించి ఉన్నత పదవులు, ఉద్యోగాలు సాధించాలని అన్నారు. చదువులో వెనుక బడిఉన్న విద్యార్థులపై అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని సూచించారు. అనంతరం మండల పరిషత్ పాఠశాల విద్యార్థులతో బోర్డు పై రాసిన పదాలను చదివించారు. అనంతరం కొత్తగా నిర్మిస్తున్న కేజీబీవీ భవనాన్ని ఆయన పరిశీలించి పెండింగ్ లో ఉన్న పనులను వెంటనే పూర్తీ స్థాయిలో పనులు పూర్తీ చేయాలనీ TSEWIDC ఈఈ ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఇమ్రాన్ ఖాన్, ఎంపీడీఓ రమాకాంత్, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ సువర్ణ, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.