DPRO ADB- విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే లక్ష్యాన్ని ఎంచుకొని ఆ దిశగా ముందడుగు వేయాలి- జాతీయ మైనారిటి కమిషన్ సభ్యురాలు సయ్యద్ షాహెజాది

విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే లక్ష్యాన్ని ఎంచుకొని ఆ దిశగా ముందడుగు వేయాలని జాతీయ మైనారిటి కమిషన్ సభ్యురాలు సయ్యద్ షాహెజాది అన్నారు. సోమవారం రోజున స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులతో ముచ్చటించి పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, విద్యార్థుల ఆలోచన విధానం మారాలని, పాఠ్యాంశాలను అర్ధం చేసుకొని విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలను సంపాదించుకోవాలని ఆకాంక్షించారు. విద్యార్థులు వారికీ నచ్చిన రంగాలను ఎన్నుకొని ఆ దిశగా స్వయం సంవృద్ధి సాధించాలని అన్నారు. సివిల్ సర్వీస్ లాంటి కోచింగ్ ఇప్పించే ఏర్పాటు చేస్తామని భరోసా కల్పించారు. విద్యార్థులు యవ్వన ప్రాయంలో ప్రేమవ్యవహారాల వైపు ద్రుష్టి సారించకుండా కుటుంబానికి ఆసరాగా నిలబడాలని అన్నారు. బాలికలు కనీసం డిగ్రీ స్థాయి వరకైనా తప్పని సరిగా విద్యను అభ్యసించాలని అన్నారు. విద్యార్థులు బాగా చదవాలని, కష్టపడాలని అన్నారు. అబ్దుల్ కలాం, స్వామి వివేకానంద వంటి మహోన్నత వ్యక్తులను ఆదర్శం గా తీసుకోవాలని అన్నారు. 15 నుండి 18 సంవత్సరాల వయసుగల విద్యార్థులు తప్పని సరిగా టీకా మందును తీసుకోవాలని అన్నారు. అంతకుముందు కమిషన్ సభ్యురాలు విద్యార్థులతో మమేకమై వారి సీట్లలో కూర్చొని విద్యాభ్యాసం, మధ్యాహ్న భోజనం, తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు కావలసిన సౌకర్యాలను సమకూర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి ఏర్పాట్లు చేస్తానని భరోసా కల్పించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వి. పద్మ మాట్లాడుతూ, తాను చదువుకున్న మూలలను మరిచిపోకుండా ఉన్నత స్థానంలో ఉన్నప్పటికి పాఠశాలను సందర్శించి విద్యార్థులను స్ఫూర్తి దాయకంగా నిలవడం అభినందనీయమని అన్నారు. పాఠశాలలో ఉర్దూ మీడియంలో తగినంత సిబ్బంది లేరని, త్రాగునీరు సౌకర్యం, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలని కోరారు. పాఠశాలలో 658 మంది బాలికలు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత, జిల్లా మైనారిటి సంక్షేమ అధికారి కృష్ణవేణి, పాఠశాల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు. స్థానిక సరస్వతి విశ్రాంతి భవనంలో కమిషన్ సభ్యురాలిని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందించారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు.

Share This Post