DPRO ADB-వ్యాక్సిన్ పంపిణీలో ప్రజల భాగస్వామ్యం, ప్రజాప్రతినిధులు సహకారం అందించాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ప్రజల భాగస్వామ్యం, ప్రజాప్రతినిధుల సహకారం, అధికార యంత్రాంగం నిర్వరామ కృషితో వ్యాక్సిన్ పంపిణీలో లక్ష్యాలను సాధించడానికి చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం రోజున ఆదిలాబాద్ పట్టణంలోని సంజయ్ నగర్, ఆదిత్య నగర్, మీడియా కాలనీ లలో వ్యాక్సినేషన్ పంపిణి కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఓమైక్రాన్ థర్డ్ వేవ్ వ్యాప్తి చెందక ముందే జిల్లాలోని అర్హులైనా ప్రతి ఒక్కరు రెండు డోస్ ల వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు రావాలని అన్నారు. గత వారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వైద్య అధికారుల బృందం జిల్లాలో పర్యటించి జిల్లా యంత్రాంగానికి వ్యాక్సినేషన్ పై వందశాతం లక్ష్య సాధనకు దిశానిర్దేశం చేశారని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 82 శాతం మంది వ్యాక్సిన్ తీసుకోవడం జరిగిందని, మిగితా 18 శాతం మందిని ప్రేరేపిస్తూ, అవగాహన కల్పిస్తూ, వ్యాక్సిన్ పంపిణి చేసేందుకు సూక్ష్మ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని వివరించారు. మెడికల్, పంచాయితీ రాజ్, మున్సిపల్, తదితర శాఖల అధికారులకు సమావేశాలు, టెలి కాన్ఫరెన్స్ ల ద్వారా ఎప్పటికప్పుడు మార్గదర్శనం చేస్తూ, గ్రామాలు, పట్టణంలోని పలు వార్డులలో పబ్లిక్ వాలంటీర్లు, తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులతో అవగాహన కల్పిస్తూ వ్యాక్సిన్ అందిస్తున్నామని తెలిపారు. జిల్లాలో శతాధిక మహిళా వృద్దులు వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావడం, 18 సంవత్సరాలు నిండిన యువత స్వచ్చందంగా వ్యాక్సిన్ కోసం రావడం మంచి పరిణామమని అన్నారు. ప్రజలు ఇదే స్పూర్తితో ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకొని వందశాతం లక్ష్యాలను సాధించడానికి సహకరించాలని కలెక్టర్ కోరారు. వివిధ వార్డులు, గ్రామాలలో వ్యాక్సిన్ పంపిణి చేస్తున్న టీమ్ లు మరింత వేగవంతంగా డిసెంబర్ నెలాఖరు నాటికీ జిల్లాలోని అర్హులైన వారందరికీ అందించాలని అన్నారు. స్పూర్తితో పని చేస్తున్న యంత్రాంగాన్ని అభినందిస్తున్నామని తెలిపారు. గత రెండు కోవిద్ వేవ్ లను దృష్టిలో పెట్టుకొని ఓమైక్రాన్ థర్డ్ వేవ్ ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంతో పాటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ బెడ్లను సిద్ధం చేస్తున్నామని, ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం, వైద్య అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఓమైక్రాన్ వేవ్ వ్యాప్తి దృష్ట్యా ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు, మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, తరచూ చేతులు శుభ్రపరచుకోవాలని అన్నారు. ప్రజలకు ఈ వివరాలను చేరవేయడంలో మీడియా తమ వంతు పాత్రను పోషించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ శైలజ, జిల్లా పౌర సంబంధాల అధికారి ఎన్.భీమ్ కుమార్, ఆయా వార్డుల ప్రత్యేక అధికారులు సునీత, శ్రీనివాస్, మెప్మా సిబ్బంది భాగ్యలక్ష్మి, మెడికల్ టీమ్ లు, ఆయా వార్డుల కౌన్సిలర్ లు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post