DPRO ADB- సామ్ -మామ్ పిల్లలను గుర్తించి అవసరమైన పౌష్టికాహారం, వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

సామ్ -మామ్ పిల్లలను గుర్తించి అవసరమైన పౌష్టికాహారం అందించడంతో పాటు వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో సామ్- మామ్ పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారం పై ఐసిడిఎస్, వైద్య అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో సెప్టెంబర్ మాసాంతానికి 216 మంది సామ్ పిల్లలు, 942 మంది మామ్ పిల్లలు ఉన్నారని తెలిపారు. సామ్ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ వారిలో ఉన్నటువంటి ఆరోగ్య లోపాలను సమతుల్యం చేయడానికి అవసరమైన పౌష్టికాహారం, వైద్య చికిత్సలు అందించేందుకు చర్యలు చేపట్టాలని, జీరో స్థాయికి తీసుకురావాలని ఆదేశించారు. మండల స్థాయిలో సీడీపీఓ లు మండల పరిషత్ అధికారులతో సమావేశాలు నిర్వహించి తక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామపంచాయితీ స్థాయిలో సామ్-మామ్ పిల్లలకు సంబంధించిన రిజిస్టర్ లు నిర్వహించాలని ఆదేశించారు. పిల్లల ఎదుగుదలకు సంబందించిన వివరాలు నమోదు చేయాలనీ అన్నారు. సామ్ పిల్లలను సమీప మెడికల్ ఆఫీసర్ ల వద్దకు తీసుకువెళ్లి వైద్య చికిత్సలు ఇప్పించాలని, అవసరమైన పక్షంలో న్యూట్రిషన్ కేంద్రాలకు పంపించాలని సూచించారు. ప్రతి మండలంలో సీడీపీఓ లు పర్యటించి సామ్-మామ్ పిల్లలపై సమీక్షలు నిర్వహించాలని అన్నారు. ప్రతి బుధవారం అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని పర్యవేక్షించాలని అన్నారు. జిల్లా సంక్షేమ అధికారిణి మిల్కా మాట్లాడుతూ, జిల్లాలో 44159 మంది పిల్లలకు గాను 43001 మంది పిల్లలు సాధారణ స్థాయిలో ఉన్నారని, 216 మంది సామ్, 942 మంది మామ్ స్థాయిలో ఉన్నారని వివరించారు. తీవ్ర పౌష్టికాహార లోపం ఉన్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతున్నదని తెలిపారు. అంతకుముందు సీడీపీఓ ల వారీగా, మండలాల వారీగా కలెక్టర్ సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.నరేందర్ రాథోడ్, జిల్లా పంచాయితీ అధికారి శ్రీనివాస్, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డా.సాధన, సీడీపీఓ లు, సూపర్ వైజర్లు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post