DPRO ADB-హరితహారం కార్యక్రమం విజయవంతానికి ప్రత్యేక చర్యలు- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

హరితహారం కార్యక్రమం విజయవంతానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ బిఆర్కే భవన్ నుండి తెలంగాణకు హరితహారం కార్యక్రమంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ కార్యాలయం నుండి ఆమె పాల్గొన్నారు. 8 వ విడత హరితహారం, దళితబంధు, ధాన్యం కొనుగోలు, తదితర అంశాలపై జిల్లాల వారిగా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో హరితహారం కార్యక్రమం విజయవంతం చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. జిల్లాలో ఈ సంవత్సరం 44 లక్షల 74 వేల మొక్కలు నాటడానికి ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. లక్ష్యానికి అనుగుణంగా నర్సరీలలో కావలసిన మొక్కలు అందుబాటులో ఉన్నాయని, వేసవి దృష్ట్యా మొక్కల సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జులై లో ప్రారంభం కానున్న 8 వ విడత హరితహారం కోసం మొక్కలు నాటే స్థలాలను గుర్తించడం జరిగిందని తెలిపారు. పచ్చదనం పెంపొందే విధంగా పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, అర్బన్ పార్క్ లలో మొక్కలు నాటడంతో పాటు, ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, కాలువల గుండా అధిక సంఖ్యలో మొక్కలు నాటేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలలో విరివిగా మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. దళిత బంధు పథకం లబ్దిదారులకు ఇప్పటివరకు 209 యూనిట్ల గ్రౌండింగ్ కు చర్యలు తీసుకున్నామని తెలిపారు. జిల్లాలో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేసి వరిధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని అన్నారు. రైతువేదికల వద్ద ప్రత్యామ్నాయ, లాభదాయక పంటల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని, వ్యవసాయ విస్తరణ అధికారులు రైతు వేదికల నుండి విధులు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు ఎన్.నటరాజ్, రిజ్వాన్ బాషా షేక్, జిల్లా అటవీ అధికారి రాజశేఖర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్ రాథోడ్, అటవీ అభివృద్ధి అధికారి రాహుల్ కిషన్ జాదవ్, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post