పత్రికా ప్రకటన
తేదీ 04-08-2021
కరీంనగర్
దళిత బందు ద్వారా ఆదాయం వచ్చే పథకాలను ఎంపిక చేసుకోవాలి
ఈనెల 16న హుజురాబాద్ లో దళిత బంధు పథకం ప్రారంభం
సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా
O0000
ఈనెల 16న హుజూరాబాద్ నియోజక వర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి దళిత బంధు పథకం ప్రారంభిస్తారని సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా అన్నారు .
బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో హుజరాబాద్ దళితబంధు మండల రిసోర్స్ పర్సన్ లతో, జిల్లా అధికారులతో దళిత బంధు పథకం అమలుపై సూచనలు, సలహాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత బందు పథకం ద్వారా నిరుపేద దళిత కుటుంబాలకు చెందిన వారిని ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి దళిత బంధు పథకాన్ని ప్రవేశ పెడుతున్నారని తెలిపారు .దళిత బంధు పథకం కింద మంజూరైన యూనిట్ల ద్వారా వెంటనే లబ్ధిదారులకు ఆదాయం వచ్చే యూనిట్లను ఎంపిక చేసుకోవాలని సూచించారు . దళిత బంధు పథకం ప్రారంభం రోజున హుజరాబాద్ నియోజకవర్గం లోని ప్రతి గ్రామం నుండి గ్రామానికి 20 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి దళిత బంధు యూనిట్లను రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులమీదుగా అందజేస్తారని తెలిపారు. హుజరాబాద్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో అర్హులైన నిరుపేద కుటుంబాల అందరికీ దళిత బంధు పథకం కింద యూనిట్లు మంజూరు చేస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా హుజురాబాద్ దళిత బంధువు మండల రిసోర్స్ పర్సన్ లతో గ్రామాలలో దళితుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఏ విధమైన యూనిట్లు ఎంపిక చేసుకుంటున్నా యూనిట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి దళిత బందు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గం లో ఈ నెల 16న ప్రారంభిస్తారని, దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గం లో విజయవంతం చేస్తే, రాష్ట్ర స్థాయిలో విజయవంతంగా అమలు జరుగుతుందని అన్నారు. దళిత బంధు పథకం ఉద్దేశం దళితులను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడమే లక్ష్యమని , తద్వారా దళితులకు బంగారు భవిష్యత్తు లభిస్తుందని అన్నారు . దళిత బంధు పథకానికి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయడం ముఖ్యమని అన్నారు . దళిత బంధు యూనిట్లు మంజూరు అయిన వెంటనే నెల నెల ఆదాయము వచ్చే విధంగా యూనిట్ల ఎంపిక ఉండాలని అన్నారు.
ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి దళితులు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లేందుకు దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని అందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. దళిత బంధు కింద అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి యూనిట్లు మంజూరు అవుతాయని తెలిపారు . దళిత బంధు పథకం హుజరాబాద్ లో విజయవంతం అవుటకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
ఈ సందర్భంగా దళిత బందు మండల రిసోర్స్ పర్సన్ లు మాట్లాడుతూ ఒక గ్రామంలో ఒకే రకమైన యూనిట్లు మంజూరు చేయకుండా ,వివిధ రకాల యూనిట్లు మంజూరు చేస్తే బాగుంటుందని తెలిపారు . దళితులు స్వయం ఉపాధి యూనిట్ల ను ఏర్పరచుకొని నిర్వహించుటకు వీలుగా అవసరమైన వృత్తి నైపుణ్యత లేదని ,వారికి యూనిట్ల నిర్వాహణకు అవసరమైన వృత్తి నైపుణ్య శిక్షణ ఇప్పించాలని కోరారు. తద్వారా దళితులు స్వయం ఉపాధి యూనిట్లు స్థాపించిన వెంటనే ఆదాయ వనరులు పెంచు కొనుటకు వీలు ఉంటుందని అన్నారు. దళిత బందు యూనిట్ల నిర్వహణకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇప్పించి ప్రోత్సహించాలని అని కోరారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ , ట్రైనీ కలెక్టర్ మయాంక్ మిట్టల్, జిల్లా పరిషత్ సీఈవో ప్రియాంక, డి ఆర్ డి ఓ శ్రీలత , డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్, పంచాయతీరాజ్ ఎస్ ఈ సుదర్శన్ రావు ,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జూవేరీయా, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ అధికారి నేతనియల్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మధుసూదన శర్మ, దళిత బంధు మండల రిసోర్స్ పర్సన్లు ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జారీ చేసిన వారు సహాయ సంచాలకులు సమాచార పౌర సంబంధాల శాఖ కరీంనగర్