పత్రికా ప్రకటన తేదీ :13-08 -2021
కరీంనగర్
టి.ఎస్.ఆర్.జె.సి. ప్రవేష పరీక్షకు ఏర్పాట్లు పూర్తి
అదనపు కలెక్టర్ జి.వి. శ్యాం ప్రసాద్ లాల్
-000-
తెలంగాణ రాష్ట్ర గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్ తొలి ఏడాదిలో ప్రవేశాలకు సంబంధించి ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయని అదనపు కలెక్టర్ జి.వి. శ్యాం ప్రసాద్ లాల్ తెలిపారు.
శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రవేశ పరీక్షకు సంబంధించి రూట్ ఆఫీసర్లు, ఎం.ఈ.వో.లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్ల తో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 14న శనివారం రోజున ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం12.30 గంటల వరకు జరిగే ప్రవేశ పరీక్షకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి కరీంనగర్ పట్టణంలో 24 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. 4,500 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారని, ఇందుకు సంబంధించి 24 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 24 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, 4 రూట్ ఆఫిసర్లను నియమించామని తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తు ఉంటుందని, ఒక ఏ.ఎన్.ఎం. ఉంటారని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాలను సానిటైజ్ చేశామని, పరీక్ష కు హాజరయ్యే విద్యార్థులకు సానిటైజర్లను, థార్మోస్కానర్లను అందుబాటులో ఉంచాలని ఆయన సూచించారు. విద్యార్థులు తప్పని సరిగా మాస్కులు ధరించి పరీక్ష సమయానికి గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఆయన పేర్కొన్నారు. ప్రతి పరీక్ష కేంద్రం గదుల్లో 16 మంది విద్యార్థులు మాత్రమే ఉండేలా, వారు సామాజిక దూరం పాటించేలా సీటింగ్ ఏర్పాట్లు చేయాలని ఆయన అన్నారు. కోవిడ్ నియమ నిబంధనలను తప్పని సరిగా పాటించాలని తెలిపారు. ఓ.ఎం.ఆర్. షీట్లల్లో ఎలాంటి కొట్టివేతలు లేకుండా విద్యార్థులకు అవగాహన కల్పించాలని, విద్యార్థులకు బుక్ లేట్స్ అందజేశాక, ఇన్విజిలేటర్లు సంతకాలు చేయాలని అన్నారు.
ఈ సమావేశంలో టి.ఎస్.ఆర్.జె.సి. కన్వీనర్ టి. శ్రీనివాస్, జిల్లా విద్యాశాఖా సహాయ కమీషనర్ వాసవి, తదితరులు పాల్గొన్నారు.
జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ కరీంనగర్