DPRO KMNR తేది : 14-08-2021 : ఫోటోలు & ప్రెస్ నోట్ : కలెక్టరేట్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ప్రిన్సిపల్ కార్యదర్శి రాహుల్ బొజ్జా, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ పాల్గొన్నారు. (కరీంనగర్ జిల్లా)

పత్రికా ప్రకటన తేదీ :14-08 -2021
కరీంనగర్

అర్హులందరికి దళిత బంధు పథకం మంజూరు

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్
– 00000

దళిత బంధు పథకాన్ని అర్హులైన ప్రతి కుటుంబానికి మంజూరు చేస్తామని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు.

శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో దళిత బంధు పథకం పై షెడ్యూల్డ్ కులాల ప్రిన్సిపాల్ సెక్రటరీ రాహుల్ బొజ్జ, జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ తో కలిసి పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత బంధు పథకాన్ని హుజురాబాద్ నియోజకవర్గంలో పైలేట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో దళిత బంధు పథకాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించుటకు హుజురాబాద్ నియోజకవర్గం పైలేట్ ప్రాజెక్టులో తలెత్తిన సమస్యలను గుర్తించి మర్గదర్శకాలు రూపొందించుటకు ఉపయోగపడుతుందని తెలిపారు. దళిత బంధు పథకం ఒక అద్భుతమైన పథకం అని సి.ఎస్. తెలిపారు. ఈ పథకం క్రింద అర్హత కలిగిన ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం మంజూరు చేస్తామని తెలిపారు. దీనికి బ్యాంకు లింకేజీ లేదని అన్నారు. దళిత బంధు పథకాన్ని ఈ నెల 16 న రాష్ట్ర ముఖ్యమంత్రి హుజురాబాద్ నియోజకవర్గం లో లాంచనంగా ప్రారంభిస్తారని తెలిపారు. ప్రారంభ కార్యక్రమంలో నిరుపేద దళిత కుటుంబాలకు చెందిన 15 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆర్థిక సహాయం చెక్కులను అందజేస్తామని అన్నారు. లబ్ధిదారులు తమ అనుభవం, నైపుణ్యం ఉన్న వృత్తిలో వారికి ఇష్టమైన ఒక యూనిట్ ను ఎన్నుకొని నెలకొల్పుకోవాలని సూచించారు. ఈ పథకం అమలుకు గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గం స్థాయి, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక సీనియర్ ప్రత్యేక అధికారులు, గ్రామ సర్పంచు, ఎం.పి.టి.సిలు, ప్రజాప్రతినిధులు, దళితుల సమక్షంలో గ్రామ సభలు నిర్వహించి పారదర్శకంగా ఎంపిక చేస్తారని తెలిపారు. లబ్ధిదారుల జాబితాను గ్రామ పంచాయితీ కార్యాలయం బోర్డులలో ప్రదర్శిస్తారని అన్నారు. ఈ పథకాన్ని అతి నిరుపేద కుటుబాలకు ముందుగా తర్వాత దళిత కుటుంబాలందరికి మంజూరు చేస్తామని తెలిపారు.

షెడ్యూల్డ్ కులాల ప్రిన్సిపాల్ సెక్రటరీ రాహుల్ బొజ్జ మాట్లాడుతూ దళిత బంధు పథకాన్ని హుజురాబాద్ నియోజకవర్గంలో పైలేట్ ప్రాజెక్టుగా చేపట్టి అర్హత గల ప్రతి దళిత కుటుంబానికి మంజూరు చేస్తామని తెలిపారు. నియోజకవర్గంలోని 107 గ్రామాలలో సమగ్ర కుటుంబ సర్వే వివరాల ప్రకారము ప్రతి గ్రామంలో, వార్డులలో గ్రామ సభలు నిర్వహించి సీనియర్ ఆఫీసర్ల సమక్షంలో దళిత బంధు కో-ఆర్డినేటర్లు, సర్పంచులు, ఎంపిటిసిలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, దళితుల సమక్షంలొ చర్చించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారని తెలిపారు. సీనియర్ అధికారులు ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాను జిల్లా కలెక్టర్ కు పంపిస్తారని తెలిపారు. ఒక గ్రామంలొ అందరూ ఒకే స్కీమ్ కాకుండా వారి ఆసక్తి, అభిరుచి, వృత్తి నైపుణ్యతను బట్టి వేరు వేరు స్కీములు ఎంపిక చేసుకొవాలని సూచించారు. లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న స్కీములను అధికారులు 1–2 సంవత్సరముల పాటు విజయవంతంగా స్కీమ్ నడుపుకునేలా పర్యవేక్షిస్తారని తెలిపారు. దళిత బంధు లబ్ధిదారులు దురదృష్టవశాత్తు చనిపోతే ఆదుకొనుటకు వీలుగా దళిత రక్షణ నిధిని ఏర్పాటు చెస్తున్నామని తెలిపారు. ఈ రక్షణ నిధికి లబ్ధిదారుల వాటా, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వాటా ఉంటుందని తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, తదితరులు పాల్గొన్నారు.

జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ కరీంనగర్

Share This Post