DPRO KMNR తేది: 15-09-2021 : phots & press note : వినాయక నిమర్జనం ఏర్పాట్ల సమావేశం లోమాట్లాడుతున్నరాష్ట్ర పౌర సరఫరాలు, బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, సిపి సత్యనారాయణ,నగర మేయర్ వై సునీల్ రావు,అదనపు కలెక్టరు గరిమ అగర్వాల్, శ్యాం ప్రసాద్ లాల్, (కరీంనగర్ జిల్లా ).

పత్రికా ప్రకటన                               తేదీ: 15-09-2021

కరీంనగర్

        వినాయక నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు

                        ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనాన్ని అట్టహాసంగా జరుపుకోవాలి

అన్ని వినాయక మండపాలకు విద్యుత్ చార్జీలు స్వంతంగా చెల్లిస్తాను

రాష్ట్ర పౌర సరఫరాలు, బి.సి. సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్

0000

జిల్లాలో ఈ నెల 19 న జరుగు వినాయక నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పౌర సరఫరాలు, బి.సి. సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్, పోలీస్ కమీషనర్ వి. సత్యనారాయణ, నగర మేయర్ వై.సునీల్ రావు, జిల్లా అధికారులతో కలిసి వినాయక నిమజ్జనం ఏర్పాట్ల పై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరీంనగర్ లో ఏ పండుగ అయిన అన్ని మతాల ప్రజలు కలిసి మెలిసి సోదర భావంతో జరుపుకుంటారని అన్నారు. కరీంనగర్ శాంతి, సామరస్యానికి మారు పేరని, ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా వినాయక నిమజ్జనాన్ని ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా శాంతియుత వాతావరణంలో సాంప్రదాయబద్ధంగా, అట్టహాసంగా జరుపుకోవాలని ప్రజలను కోరారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే కరీంనగర్ నియోజకవర్గంలో ప్రజలు ఏర్పాటు చేసిన గణేష్ మండపాల విద్యుత్ బిల్లులను స్వంతంగా చెల్లిస్తానని, ఎవరి నుండి బిల్లులు వసూల్ చేయకూడదని మంత్రి ట్రాన్స్-కో ఎస్.ఈ. ని ఆదేశించారు. మండపాలకు అయిన విద్యుత్ బిల్లులను తన  క్యాంపు కార్యాలయంలో ఇవ్వాలని, వెంటనే అందుకు సరిపడా బిల్లులు చెల్లిస్తానని  మంత్రి తెలిపారు. గత రెండు సంవత్సరాల నుంచి కోవిడ్ కారణంగా గణేష్ నిమజ్జనం జరుపుకోలేదని, ఈ సంవత్సరం గణేష్ నిమజ్జనం ఘనంగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కరీంనగర్ మండపాలలో ఏర్పాటు చేసిన వినాయకులను మానకొండూర్ చెరువు , కొత్తపెల్లి చెరువు, చింతకుంట వద్ద కెనాల్లో నిమజ్జనం చేయుటకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నిమజ్జనం పాయింట్ల వద్ద పకడ్బందీ బార్ కేడింగ్, లైటింగ్ ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఒక్కొక్క పాయింట్ వద్ద రెండు పెద్ద క్రేన్లు, ఒక చిన్న క్రేన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నిమజ్జనం స్థలాలలో  ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా గజ ఈతగాళ్లను (స్విమ్మర్లను) మూడు షిప్టులలో నియమించాలని ఆదేశించారు. నాలుగు సంవత్సరాల క్రితము గణేష్ నిమజ్జనానికి చెరువులలో నీరు లేక ఇబ్బందిపడ్డామని, ఈ సారి అన్ని చెరువులలో, జలాశయాలలో నీరు సమృద్ధిగా ఉందని మంత్రి తెలిపారు. గణేష్ నిమజ్జనాన్ని రాత్రి 12.00 గంటల నుండి 1.00 గంటల వరకు పూర్తి అయ్యేలా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. గణేష్ నిమజ్జనం ప్రదేశాలలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని జిల్లా వైద్యా ఆరోగ్య శాఖాధికారిని మంత్రి ఆదేశించారు. నిమజ్జనం జరుగు స్థలాలలో అంబులెన్సులను సిద్ధంగా ఉంచాలని అన్నారు. నిమజ్జనానికి గ్రానైట్ యజమానులు క్రేన్లను ఏర్పాటు చేస్తారని తెలిపారు. వినాయకులు వెళ్లు రూట్ లలో ప్రమాదాలు జరుగకుండా విద్యుత్ లైన్లను పైకి లేపాలని విద్యుత్ అధికారులకు మంత్రి సూచించారు.

జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ మాట్లాడుతూ ఈ నెల 19 న జరుగు గణేష్ నిమజ్జనానికి మానకొండూర్, కొత్తపెల్లి, చింతకుంటలో నిమజ్జన పాయింట్లను గుర్తించామని తెలిపారు. ప్రతి నిమజ్జనం స్థలమునకు ఒక ప్రత్యేక అధికారిని నియమించామని కలెక్టర్ తెలిపారు.  అన్ని నిమజ్జన స్థలాలలో లైటింగ్ ఏర్పాట్లు, బార్ కేడింగ్, క్రేన్లు, స్విమ్మర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వినాయక నిమజ్జనం రోజున జిల్లాలో వైన్ షాపులు, బార్ లు, బెల్ట్ షాపులను మూసి వేయించుటకు ఉత్తర్వులు జారీ చేశామని తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేశామని, నిమజ్జన స్థలాలలో స్టాండ్ బై క్రింద జనరేటర్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

పోలీస్ కమీషనర్ వి. సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 2,697 గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేశారని, కరీంనగర్ లో 500 పెద్ద గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గణేష్ నిమజ్జనాన్ని సాంప్రదాయబద్ధంగా ఘనంగా జరుపుకొనుటకు పకడ్బందీ పొలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అన్ని గణేష్ విగ్రహాలు వెళ్లు చౌరస్తాలలో సి.సి. కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే మోబైల్ సి.సి. కెమెరాలను కూడా ఏర్పాటు చేసినట్లు సి.పి. తెలిపారు. గణేష్ నిమజ్జనాన్ని జిల్లాలో ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా జరుపుకొనుటకు సహకరించాలని కోరారు.

నగర మేయర్ వై.సునీల్ రావు మాట్లాడుతూ గణేష్ నిమజ్జనం సందర్భంగా అన్ని రూట్ లలో లైటింగ్, త్రాగు నీరు, సానిటేషన్ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మూడు వినాయక నిమజ్జనం పాయింట్ల వద్ద అధికారులను నియమించామని తెలిపారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా రోడ్ల పై గుంతలను పూడ్చుటకు టెండర్లు పూర్తి చేశామని తెలిపారు. నిమజ్జనం తర్వాత చెరువులలో చెత్తను తొలగించుటకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు శ్యాం ప్రసాద్ లాల్, గరీమా అగర్వాల్, జిల్లా వైద్యా ఆరోగ్య శాఖాధికారిని డా.జువేరియా, జిల్లా పంచాయితీ అధికారి వీర బుచ్చయ్య, ట్రాన్స్-కో ఎస్.ఈ. మాధవ రావు, అడిషనల్ సి.పి. శ్రీనివాస్, వివిధ మతాలకు చెందిన మత పెద్దలు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సహాయ సంచాలకులు, జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయం కరీంనగర్ గారిచే జారీ చేయడమైనది.

Share This Post