DPRO KMNR తేది: 25-08-2021 : Photos & press note : దళిత బంధు సర్వే బృందాల శిక్షణ కార్యక్రమం లో మాట్లాడుతున్న రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ పాల్గొన్న రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు, , రాష్ట్ర పౌర సరఫరాలు, బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, CMO కార్యదర్శి రాహుల్ బొజ్జ, కలెక్టర్లు. (కరీంనగర్ జిల్లా ).

పత్రికా ప్రకటన తేదీ :25-08 -2021
కరీంనగర్

దళితుల ఆర్థిక స్థితిగతులను మార్చేందుకే దళిత బంధు పథకం

దళిత బంధు సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి

దళిత కుటుంబాలందరికి దళిత బంధు

రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
00000

దళితుల ఆర్థిక స్థితిగతులను మార్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో దళిత బంధు ఇంటింటి సర్వే పై స్పెషల్ ఆఫీసర్లు, క్లస్టర్ ఆఫీసర్లు, బ్యాంక్ అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులకు రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి తన్నీరు హరిష్ రావు, రాష్ట్ర పౌర సరఫరాలు, బి.సి. సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ లతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రం గర్వించేలా మొదటి సారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి దళితుల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు వీలుగా దళిత బంధు పథకాన్ని ప్రవేశ పెట్టారని అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకాన్ని పైలేట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని తెలిపారు. దళిత బంధు సర్వే శుక్రవారం 27 తేది నుండి ప్రారంభించి, వారం రోజుల్లో విజయవంతంగా పూర్తి చేయాలని సర్వే అధికారులను ఆదేశించారు. సర్వేతో పాటు దళిత కుటుంబాలందరికి బ్యాంకర్లు, తెలంగాణ దళిత బంధు అక్కౌంట్ ను ఓపెన్ చేయాలని అన్నారు. రాజకీయాలకు అతీతంగా విమర్శలకు తావులేకుండా సర్వేను నిర్వహించాలని సర్వే అధికారులకు మంత్రి సూచించారు. దళిత కుటుంబాలన్నీ సంతృప్తి చెందేలా సర్వే నిర్వహించాలని, సమస్యలుంటే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని అన్నారు.

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరిష్ రావు మాట్లాడుతూ సర్వే అధికారులు దళిత బంధు సర్వేను ప్యాషన్ మోడ్ (ఇష్టం తో )లో చేయాలని అన్నారు. పేద దళిత కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపే పెద్ద కార్యక్రమం దళిత బంధు అని అధికారులు ఈ అవకాశం ను అదృష్టంగా భావించి సర్వే అధికారులు దళిత కుటుంబాలలో ఒక సభ్యునిగా వారి ఇంటికి వెళ్లి ఓపికతో, ప్రేమతో వారి మధ్యలో కూర్చుండి వారికి తృప్తిని ఇచ్చే విధంగా సర్వే నిర్వహించాలని అన్నారు. దళితులు ఇంతవరకు ట్రాక్టర్ డ్రైవర్ గా, డైయిరీలో, ఇతర వృత్తులలో కూలీలుగా ఉండే వారు దళిత బంధు పథకం ద్వారా అట్టి యూనిట్లు స్థాపించుకొని యజమానులు కాబోతున్నారని మంత్రి తెలిపారు. దళితుల జీవితాల్లో వచ్చే మార్పును మనం త్వరలో చూడబోతున్నామని తెలిపారు. ఒక ఇంట్లో ఉమ్మడి కుటుంబం అయినను ఇద్దరు కొడుకులు వివాహాలు చేసుకొని వేరు వేరుగా ఉంటుంటే మూడు కుటుంబాలుగా నమోదు చేసుకోవాలని సూచించారు. సర్వే అధికారులు లబ్ధిదారులతో సమయస్ఫూర్తితో మెలగాలని అన్నారు. రాష్ట్రంలో 15-16 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయని వారందరికీ ప్రభుత్వం దళిత బంధు అమలు చేస్తుందన్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెంచడంలో ఈ పథకం దోహదపడుతుందన్నారు. హుజురాబాద్ నియోజకవర్గానికి దళిత బంధు పథకం క్రింద ఇదివరకే 1500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి, అట్టి నిధులు జిల్లా కలెక్టర్ ఖాతాలో జమ చేసిందని తెలిపారు. మరో 500 కోట్లు రెండు, మూడు రోజుల్లో మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. మొత్తం 2,000 కోట్ల ద్వారా హుజురాబాద్ నియోజకవర్గంలోని 20 వేల దళిత కుటుంబాలు లబ్ధి పొందుతాయని తెలిపారు. సర్వే టీములు స్థానిక ప్రజా ప్రతినిధుల సమక్షంలో ఇంటింటికి వెళ్లి ఓర్పుగా, నేర్పుగా వారిలో ఒకరిగా సర్వే వివరాలు సేకరించాలని సూచించారు. లబ్ధిదారులు వారి అభిరుచి, నైపుణ్యతకు అనుగుణంగా ఏ యూనిట్ ఎంచుకుంటారో తెలుసుకొవాలని, అవసరమైతే యూనిట్ల ఎంపికకు అధికారులు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని అన్నారు. గ్రామంలో ఒకే తరహా యూనిట్ కాకుండా భూమి ఉన్న వారు డైయిరీ యూనిట్లు ఎంపిక చేసుకుంటే మంచిదని ప్రోత్సహించాలని మంత్రి సూచించారు. సర్వే బృందాలు వివరాల సేకరణ అనంతరం వెంట వెంటనే దళిత బంధు అక్కౌంట్ ఓపెన్ చేసేలా బ్యాంకర్లు చర్యలు తీసుకొవాలని అన్నారు. అనంతరం మంత్రి సర్వే అధికారులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ అధికారులకు తగు సూచనలు చేశారు.

రాష్ట్ర పౌర సరఫరాలు, బి.సి. సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమాలకర్ మాట్లాడుతూ పేద, దళిత కుటుంబాలలో వెలుగులు నింపాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. దళిత బంధు గొప్ప పవిత్ర కార్యక్రమం అని రాష్ట్రానికే గర్వ కారణమని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సెంటిమెంట్ ప్రకారం కరీంనగర్ జిల్లా నుండి ఏ పథకం ప్రారంభించిన విజయవంతం అవుతుందనే నమ్మకంతో దళిత బంధు పథకాన్ని కరీంనగర్ జిల్లాలో ప్రారంభించాలని అన్నారు. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన దళితులను సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చేసెందుకు ఈ పథకం ఎంతో దోహదపడుతుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయాలకు, లక్ష్యాలకు అనుగుణంగా హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకాన్ని విజయవంతం చేసుటకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని అన్నారు.
రైతు బంధు సర్వే బృందాల శిక్షణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కార్యాలయం సెక్రటరీ రాహుల్ బొజ్జ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, శాసన మండలి సభ్యులు నారదాసు లక్ష్మణ్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, శాసన సభ్యులు సుంకె రవిశంకర్, బాల్కా సుమన్, గువ్వల బాలరాజు, దాసరి మనోహర్ రెడ్డి, కోరుకంటి చందర్, కరీంనగర్, హన్మకొండ కలెక్టర్లు ఆర్.వి. కర్ణన్, రాజీవ్ హన్మంత్, పోలీస్ కమీషనర్ సత్య నారాయణ, అదనపు కలెక్టర్లు శ్యాం ప్రసాద్ లాల్, గరీమ అగర్వాల్, సంధ్యరాణి, నగర పాలక సంస్థ కమీషనర్ వల్లూరి క్రాంతి, జిల్లా పరిషత్ సిఈవో ప్రియాంక, దళిత బంధు సర్వే స్పెషల్ ఆఫీసర్లు, క్లస్టర్ ఆఫిసర్లు, తదితరులు పాల్గొన్నారు.

సహాయ సంచాలకులు, జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయం కరీంనగర్ చే జారీ చేయడమైనది.

Share This Post