DPRO KMNR తేది : 27-07-2021 : ఫొటోస్ & ప్రెస్ నోట్ : నూతన ఆహార భద్రత కార్డులు పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతున్న సివిల్ సప్లై, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, నగర మేయర్ వై. సునీల్ రావు, అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతి. (కరీంనగర్ జిల్లా).

పత్రిక ప్రకటన

తేదీ 27-07 -2021
కరీంనగర్

నిరుపేదల కడుపు నింపడమే ప్రభుత్వ లక్ష్యంగా దేశ చరిత్రలోనే తొలిసారి 3.09 లక్షల రేషన్ కార్డుల పంపిణీ

అర్హులైన వారందరికి రేషన్ కార్డులు మంజూరు చేస్తాం

రాష్ట్ర పౌర సరఫరాలు,బి.సి. సంక్షేమం శాఖ మంత్రి గంగుల కమలాకర్
-000-

దేశ చరిత్రలోనే ఏకకాలంలో 3,09,083 ఆహార భద్రత కార్డులు జారీ చేయుట ప్రథమం అని రాష్ట్ర బీసీ సంక్షేమం పౌర సరఫరాలు శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

మంగళవారం కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని సుభాష్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆహార భద్రత కార్డుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇంత వరకు రాష్ట్రంలో 87 లక్షల ఆహార భద్రత కార్డులున్నాయని, అందులో 2.79 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారని అన్నారు. రాష్ట్రంలో 4 కోట్ల మంది జనాభా ఉందని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత 53 లక్షల కార్డులు మాత్రమే జారీ చేయుటకు కెంద్రం అనుమతించిందని రాష్ట్ర ముఖ్యమంత్రి అదనంగా మరో 35 లక్షల ఆహార భద్రత కార్డులు మంజూరు చేశారని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఆహార భద్రత కార్డుల మంజూరుకు 4.97 లక్షల ధరఖాస్తులు వచ్చాయని, వాటిని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి తర్వాత అర్హులైన 3,09,083 మందికి ఆహార భద్రత కార్డులు మంజూరు చేశామని మంత్రి తెలిపారు. కొత్తగా మంజూరైన ఆహార భద్రత కార్డులను 26 జూన్ నుండి పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. కరీంనగర్ అర్బన్ లో 1811 ఆహార భద్రత కార్డులను జారీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. జిల్లాలో అర్హులైన లబ్ధిదారులందరికి ఆహార భద్రత కార్డులు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. ఇంత వరకు ఉన్న ఆహార భద్రత కార్డుల్లో అదనంగా సభ్యులను చేర్చుటకు త్వరలో చర్యలు తీసుకుంటామని అన్నారు. గత ప్రభుత్వంలో రేషన్ కార్డు పై ఒకరికి నాలుగు కిలోల చొప్పున 20 కిలోల బియ్యం మాత్రమే ఇచ్చెందుకు పరిమితి ఉండేదని ప్రస్తుతం రేషన్ కార్డు పై ఎంత మంది ఉన్న ఆరు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. కొత్తగా మంజూరు చేసిన ఆహార భద్రత కార్డుల పై ఆగష్టు మాసం నుండి బియ్యం పొందవచ్చునని అన్నారు. ఆహార భద్రత కార్డులకు ఎలాంటి ఫైరవీలు లేకుండా పూర్తి పారదర్శకంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కార్డులు మంజూరు చేస్తామని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాకముందు రాష్ట్రంలో 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లతో బీడు భూములను సస్యశ్యామలం చేయడం వలన 8 లక్షల నుండి ఇప్పుడు 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించే స్థాయికి ఎదిగామని తెలిపారు. ఏడు సంవత్సరాలలో భారతదేశం మొత్తానికి అన్నం పెట్టే రాష్ట్రంగా ఎదిగామని మంత్రి అన్నారు. రాష్ట్రంలో త్రాగు నీటి కొరత లేదని ప్రతి రోజు స్వచ్చమైన త్రాగు నీరును ప్రజలకు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. రైతులకు ఉచిత నాణ్యమైన 24 గంటల కరెంటు అందిస్తున్నమని తెలిపారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకం ద్వారా 1,00,116/- రూ.లు అందించి ఆదుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన వారికి 13 వేలు, కెసిఆర్ కిట్ అందిస్తున్నామని మంత్రి తెలిపారు. రైతులకు రైతుబంధు పథకం ఎలాగో, అలాగే దళితులను ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేయాలనే ముఖ్యమంత్రి దళిత బంధు పథకాన్ని ప్రవేశపెడుతున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, శాసన మండలి సభ్యులు నారదాసు లక్ష్మణ్ రావు, నగర మేయర్ వై. సునీల్ రావు, అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్, నగర పాలక సంస్థ కమీషనర్ వల్లూరి క్రాంతి, జిల్లా పౌర సరఫరాల అధికారి సురేష్ రెడ్డి, సివిల్ సప్లయ్ డి.ఎం. శ్రీకాంత్ రెడ్డి, కార్పోరేటర్లు అర్ష కిరణ్మయ్ – మల్లేష్, గంట కళ్యాణీ – శ్రీనివాస్, ఇతర కార్పోరేటర్లు, అర్బన్ తహశీల్దార్ సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.

సహాయ సంచాలకులు, జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం కరీంనగర్ చేజారీచేయనైనది

Share This Post