పత్రికా ప్రకటన
తేది:29- 07- 2021
కరీంనగర్
ప్రభుత్వాసుపత్రిలో సిటి స్కాన్ సేవలు త్వరలో ప్రారంభిస్తాం.
జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్
00000
జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పేద రోగులకు ఉచిత వైద్య సేవలు అందించుటకు వీలుగా ఏర్పాటు చేసిన సిటి స్కాన్ సేవలను త్వరలో ప్రారంభిస్తామని జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్ అన్నారు.
గురువారం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని , మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి లో రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి గర్భిణులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పేద రోగులకు ఉత్తమ వైద్య సేవలు అందించుటకు వీలుగా అన్ని రకాల ఎక్విప్మెంట్స్ , మౌలిక సదుపాయాలు చాలా మంచిగా ఏర్పాటు చేశారని అన్నారు. కరోనా విపత్కర సమయంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత లేకుండా సొంతంగా ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి కరోనా బారిన పడిన రోగులను కాపాడారని తెలిపారు. మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ప్రసవాల సంఖ్యను పెంచాలని డాక్టర్లను కలెక్టర్ ఆదేశించారు . కోవిడ్ పాజిటివ్ వచ్చిన గర్భిణులకు కూడా మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ప్రసవాలు నిర్వహిస్తున్నారని అన్నారు .మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న భవన నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ కాంట్రాక్టర్ ను ఆదేశించారు .జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పేద రోగులకు మరిన్ని ఎక్కువ ఉత్తమ వైద్య సేవలు అందించుటకు ఆస్పత్రిలో అవసరమైన ఎక్విప్మెంట్ సమకూర్చుటకు జిల్లా యంత్రాంగం తరపున పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రత్నమాల ,ఆర్.ఎం .ఓ. డాక్టర్ శౌరయ్య , డాక్టర్ అలీం, వైద్యులు తదితరులు పాల్గొన్నారు .
జారీ చేసిన వారు సహాయ సంచాలకులు సమాచార పౌర సంబంధాల శాఖ కరీంనగర్