DPRO NIRMAL: ఆహార భద్రత చట్టంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించండి. రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ కె. తిరుమల్ రెడ్డి.

ఆహార భద్రత చట్టంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమల రెడ్డి అధికారులను ఆదేశించారు.
మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఆకలి మరణాలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం 2013లో ఆహార భద్రత చట్టంను తీసుకు వచ్చిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని 2015 నుండి అమలు చేస్తుందని వివరించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందేలా ఈ చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రజారోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తూ విద్య, వైద్యం, వ్యవసాయం వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని వివరించారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి లబ్ధిదారుడికి ఉచితంగా నిత్యావసర సరుకులు, అంగన్వాడీ కేంద్రాలలో పౌష్టికాహారం పంపిణీ సక్రమంగా జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. వైద్య శాఖ ద్వారా ప్రజల ఆరోగ్య స్థితిగతులను సర్వే చేసి పౌష్టికాహారం లోపించిన వారికి పౌష్టికాహారంతో పాటు వైద్యం అందించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవిస్తే మగబిడ్డకు 12వేలు, ఆడబిడ్డకు 13వేల తోపాటు కెసిఆర్ కిట్ అందించడం జరుగుతుందన్నారు. కెసిఆర్ కిట్ పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఫుడ్ సెక్యూరిటీ కమిటీలను ఏర్పాటు చేసుకొని ఆహార భద్రత చట్టం పై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలన్నారు. ఎక్కడైనా ఆకలి మరణాలు సంభవిస్తే చట్ట పరిధిలో కఠినంగా శిక్షలు ఉంటాయని తెలిపారు. జిల్లాలో కొత్తగా 5835 రేషన్ కార్డులను పంపిణీ చేయడం జరిగిందని ప్రతి లబ్దిదారునికి నిత్యావసర సరుకులు అందేలా చూడాలన్నారు. ప్రభుత్వ పథకాలు అందని ఎడల ఎవరికి ఫిర్యాదు చేయాలి, ఎలా పొందాలి తదితర వివరాలను పొందుపరుస్తూ అంగన్ వాడి కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సంక్షేమ శాఖల కార్యాలయాలలో నోటీస్ బోర్డ్ లను ఏర్పాటు చేయాలన్నారు.
జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారుఖీ మాట్లాడుతూ జిల్లాలో వివిధ సంక్షేమ పథకాలను పగడ్బందీగా అమలు చేయడం జరుగుతుందని వివరించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రాంబాబు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కిరణ్ కుమార్, జిల్లా పరిషత్ సీఈఓ సుధీర్, ఆర్డీఓ రాథోడ్ రమేష్, జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాసరెడ్డి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాజేశ్వర్ గౌడ్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజలింగు, జిల్లా శిశు సంక్షేమ, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి స్రవంతి, ఇతర శాఖల అధికారులు,వివిధ మండలాల చెందిన జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి నిర్మల్ చే జారీ చేయడమైనది.

Share This Post