DPRO NIRMAL: కోటి 50 లక్షలతో నిర్మల్ లో “ఈ లైబ్రరీ” జిల్లా గ్రంథాలయ సంస్థ సర్వ సభ్య సమావేశంలో ఆమోదం. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎ.రాజేందర్.

కోటి 50 లక్షలతో నిర్మల్ లో “ఈ లైబ్రరీ” జిల్లా గ్రంథాలయ సంస్థ సర్వ సభ్య సమావేశంలో ఆమోదం
నిర్మల్ జిల్లా కేంద్రంలో రూ॥ కోటి 50 లక్షల వ్యయంతో ఈ లైబ్రరీ నిర్మించేందుకు జిల్లా గ్రంథాలయ సంస్థ సర్వసభ్య సమావేశంలో తీర్మానించారు. గురువారం స్థానిక జిల్లా గ్రంథాలయ సంస్థలో నిర్వహించిన సమావేశానికి గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎ.రాజేందర్ అధ్యక్షత వహించారు. కోల్ కతాకు చెందిన రాజారామ్మోహన్రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో ప్రభుత్వం కోటి 50 లక్షలు కేటాయించిందని గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ రాజేందర్ అన్నారు. దీని నిర్మాణానికి గాను అంబేడ్కర్ భవనం పక్కనే 8 గుంటల స్థలాన్ని గత కలెక్టర్ కేటాయించిందన్నారు. భవన నిర్మాణానికి సంబంధిత సంచాలకులకు పంపుటకు సభ్యులు ఆమోదం తెలిపారు. ప్రస్తుతం ఉన్న గ్రంథాలయ భవనం పై 20 లక్షల అంచనాతో రెండో అంతస్తు నిర్మిస్తే పోటీపరీక్షల కొరకు చదువుకునే పాఠకులకు సౌకర్యవంతంగా ఉంటుందని సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో 40 లక్షలు మంజూరు కాగా ఇందులో 20 లక్షలతో పై అంతస్తు నిర్మాణం చేపట్టుటకు సభ్యులు ఆమోదం తెలిపారు. కుభీర్ లోని వనసంరక్షణ సమితి ఆవరణలో గ్రంథాలయ భవన నిర్మాణానికి గ్రామ పంచాయితీ ద్వారా స్థలం కేటాయించబడిందని చైర్మన్ రాజేందర్ తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థ నిధులు 15 లక్షల అంచనా వ్యయంతో గ్రంథాలయ భవన నిర్మాణం చేపట్టుటకు తీర్మానించారు. లోకేశ్వరం గ్రంథాలయ భవనం శ్లాబు మరమ్మతులు, మరుగుదొడ్ల నిర్మాణం, ఇతర మౌలిక వసతులకు 5 లక్షల వ్యయంతో చేపట్టుటకు ఆమోదం తెలిపారు. గ్రంథాలయ సంస్థ సంచాలకుల ఆమోదం మేరకు జిల్లాలోని 14 గ్రంథాలయాలలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ల ద్వారా స్వీపర్స్ ను నియమించుటకు నిర్ణయించారు. పార్ట్ టైమ్ వర్కర్స్ కు కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించుటకు సభ్యులు ఆమోదం తెలిపారు. పుస్తకాల కొనుగోలుకు బడ్జెట్లో 20 లక్షలు కేటాయించబడగా సంచాలకులు పంపిన జాబితా ద్వారా తెలుగు అకాడమి, ఇతర ప్రభుత్వ పబ్లికేషన్లలో 10 లక్షలతో పుస్తకాలు చేయుటకు ప్రతిపాదనలు సిద్ధం చేయుటకు సమావేశం తీర్మానించింది. ఆన్ డిమాండ్ పుస్తకాల కొనుగోలుకు 2 లక్షలు మంజూరుకాగా ఈ నిధులతో పుస్తకాలు కొనుగోలు చేయనున్నారు. తానూరులోని గ్రంథాలయాన్ని అద్దె భవనంలోకి మార్చినట్లు కార్యదర్శి లక్ష్మీరాజ్యం తెలిపారు.
రాజా రామ్మోహన్ రాయ్ ఫౌండేషన్ మేచింగ్ స్కీం క్రింద గ్రంథాలయ ఆధునీకరణ కోసం కంప్యూటర్లు, ప్రింటర్, ఫర్నిచర్ కోసం 5 లక్షల నిధులు మంజూరుకు ప్రతిపాదనలు సంచాలకులకు పంపుటకు ఆమోదం తెలిపారు.
ఈ సమావేశంలో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పీ. లక్ష్మీరాజ్యం డీపీవో వెంకటేశ్వర్రావు డీపీఆర్వో ఎం. ఉమారాణి డీఈవో తరపున సెక్టోరియల్ ఆఫీసర్ శ్రీమతి సలోనీ లు పాల్గొన్నారు.

*******************జిల్లా పౌరసంబంధాల అధికారి, నిర్మల్ చే జారీ చేయనైనది.

Share This Post