పత్రికా ప్రకటన తేది:07.01.2022
గ్రామాల్లో పరిశుభ్రతకు పెద్దపీట
గ్రామీణాభివృద్ధి సమీక్షా సమావేశంలో కలెక్టర్ ముషార్రఫ్ ఫారూఖి.
గ్రామాల్లో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారుఖి ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయం హాలులో జరిగిన గ్రామిణాభివృద్ధి సమీక్షా సమావేశంలో కలెక్టర్ అధికారులకు పలు మార్గదర్శకాలు చేశారు. డంపింగ్ యార్డుల నిర్మాణం పూర్తిచేయాలని తడి, పొడి చెత్తలను వేర్వేరుగా ఏర్పాటు చేసి రీ సైక్లింగ్ కు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రాక్టర్ల ద్వారా చెత్తకుప్పలను తొలగించాలని, వీధుల్లో పరిసరాల్లో పిచ్చిమొక్కలు తొలగించి పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. మురికి నీటి కాలువలు శుభ్రం చేయించి 100 శాతం శానిటేషన్ కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఉమ్రి కె గ్రామం సముందర్పల్లి గ్రామాలను ఆదర్శంగా తీసుకొని గ్రామాలను పారిశుద్ధ్య రహితంగా తీర్చిదిద్దాలన్నారు. భారీ వర్షాలకు కొట్టుకుపోయిన జాఫ్రాపూర్, మాదాపూర్, మునిపెల్లి గ్రామాల్లోని శ్మశానవాటికలను పునరుద్ధరించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలను యుద్ధప్రాతిపదికన వెంటనే పూర్తి చేయాలని, వచ్చే వర్షాకాలం నాటికి ప్రతి గ్రామ పంచాయితీ లో 14000 మొక్కల పెంపకం చేపట్టాలని ఆదేశించారు. వర్షాకాలం మొక్కలు నాటేందుకు గాను ఇప్పటి నుండే విత్తనాలు చల్లి మొక్కల పెంపకం చేపట్టి మొక్కలను సిద్ధం చేసుకోవాలని అన్నారు. మొక్కలు చనిపోయిన, మొలకెత్తక పోయిన చోట తిరిగి విత్తనాలు చల్లి కొత్త మొక్కలు సిద్ధం చేసుకోవాలన్నారు. రైతు వేదికలు నిర్మాణ పనులు మిగిలి ఉన్న చోట వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. ధాన్యం ఆరబెట్టే కళ్లాలు జిల్లాలో 1793 లక్షాన్ని పూర్తి చేయాలనీ వెంటనే నిర్మాణాలు చేపట్టాలన్నారు. జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి చెరిసగం మండలాల చొప్పున సమావేశాలు నిర్వహించి, అభివృద్ధి పనులు పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఇంకుడు గుంతలు 1,34,000 లక్ష్యం కాగా లక్ష్యానికి అనుగుణంగా ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ పాఠశాలలు పరిశుభ్రంగా నిర్వహించాలని ఆదేశించారు. ఓపెన్ జిమ్ములు (వ్యాయామశాలలు) దుర్వినియోగం కాకుండా పర్యవేక్షించాలని, జిమ్ముల ఏర్పాటు లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని పంచాయత్ రాజ్ ఈఈ ఆదేశించారు. ప్రత్యామ్నాయ పంటల సాగులో నిర్మల్ జిల్లా 15వ స్థానంలో ఉందని, జిల్లాలో ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు సంబంధిత అధికారులు అవగాహన కల్పించి మొదటి స్థానం కల్పించాలని కోరారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీ హేమంత్ బోర్ఖడే, జిల్లా పంచాయతీ అధికారి శ్రీ వేంకటేశ్వర రావు, పంచాయతీ రాజ్ ఇ.ఇ. శంకరయ్య, డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి, అగ్రికల్చర్ ఏడీ వినయ్ బాబు, డీఏవో అంజిప్రసాద్, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీపీలు, డీఏవోలు ఇతర అధికారులు పాల్గొన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి నిర్మల్ చే జారీ చేయనైనది.