DPRO NIRMAL: నిర్మల్ జిల్లాలో అభివృద్ధి పధంలో మత్స్య పరిశ్రమ –

నిర్మల్ జిల్లాలో అభివృద్ధి పధంలో మత్స్య పరిశ్రమ –

నిర్మల్ జిల్లాలో మత్స్య పరిశ్రమ అభివృద్ధిపథంలో ముందుకు సాగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం
అందిస్తున్న చేయూత. అధికారుల కృషి వెరసి మత్స్య పరిశ్రమ కొత్త పుంతలు తొక్కుతున్నది. మాంసాహారంలో
చేపలు శ్రేష్టమైనవని పలు పరిశోధనలు తెలుపడం, డాక్టర్లు సైతం చేపలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలను
వివరించడంతో ప్రజల్లో చేపల ఆహారం పట్ల అవగాహన పెరిగింది. ఫలితంగా మార్కెట్లో చేపలకు మరింత
డిమాండ్ పెరిగింది. గతంలో మత్స్యకార వృత్తి పట్ల కొద్దిమందే ఆసక్తి కనబరిచేవారు. నేడు ప్రభుత్వం
అందిస్తున్న ప్రోత్సాహంవల్ల మత్స్యకార కుటుంబాలన్నీ చేపల పెంపకం, విక్రయాన్ని ప్రధాన వృత్తిగా ఎంచుకొని ముందుకు సాగుతున్నారు. నిర్మల్ జిల్లాలో నీటి వనరులకు కొదువలేదు. 5 జలాశయాలు, 696 చిన్నతరహా సాగునీటి చెరువులు జిల్లాలో ఉండగా ఇందులో 5 జలాశయాలు, 207 చెరువులు మత్స్యశాఖ పరిధిలో, 489 చెరువులు గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్నాయి. జిల్లాలో మొత్తం లక్షా 7 వేల 272 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు నీటి వనరులు ఉండడం నిజంగా జిల్లా ప్రజల అదృష్టంగా చెప్పవచ్చు…!!
2020-21 సంవత్సరంలో 4.48 కోట్ల చేప పిల్లలను 637 జలాశయాలు, చెరువులు, కుంటలలో
వేయగా, అవి పెరిగిన తరువాత 9వేల మత్స్యకార కుటుంబాలు ప్రయోజనం పొందాయి. 2021-22
గాను 499.123 లక్షల చేపపిల్లలను 701 చెరువులు, కుంటలలో పెంచుటకు మత్స్యశాఖ లక్ష్యంగా
నిర్దేశించింది. నీరు పుష్కలంగా నిండుకున్న చెరువులు, కుంటల్లో చేప పిల్లలను విడుదల చేస్తున్నారు.
చేపలతో పాటు రొయ్యల సాగును సైతం మత్స్యశాఖ ప్రోత్సహిస్తున్నది. 2021-22 సం॥నికి గాను 85.51
లక్షల రొయ్య పిల్లల పెంపకం లక్ష్యంకాగా, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 62.37 లక్షలు, కడెం ప్రాజెక్టునందు
9.09 లక్షలు, బైంసాలోని గడ్డెన్న వాగు ప్రాజెక్టులో 13.58 లక్షలు, పొన్కల్ లోని పాత చెరువులో 0.47 లక్షల రొయ్య పిల్లలను మత్స్యశాఖ అధికారులు వదిలారు. గత జూన్ మాసాంతం నాటికి 12,500 టన్నుల చేపలు, 680 టన్నుల రొయ్యల ఉత్పత్తి జరిగిందని మత్స్యశాఖ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ దేవేందర్ తెలిపారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని స్వర్ల ప్రాజెక్టులోకి సెప్టెంబర్ 26న రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖమాత్యుల చేతుల మీదుగా 80వేల చేప పిల్లలను నీటిలోకి వదిలారు.
మత్స్యకారుల వృత్తిని మరింత ప్రోత్సహించేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని
భైంసా, సారంగాపూర్లలో ఒక్కక్కటి 10 లక్షల వ్యయంతో 2 చేపల మార్కెట్ల నిర్మాణానికి మంజూరు
చేసింది. సమీకృత మత్స్య అభివృద్ధి పథకం క్రింద నిర్మల్ పట్టణంలో 50 లక్షల వ్యయంతో హోల్సేల్
మరియు రిటైల్ మార్కెటు ఏర్పాటుకు మంజూరు లభించింది. కేజ్ కల్చర్ విధానంలో చేపల పెంపకం:
ఈ విధానంలో చేపల పెంపకం చేపట్టే వారికి ప్రభుత్వం రాయితీ కల్పిస్తున్నది. కేజ్ కల్చర్ యూనిట్ ధర 30 లక్షలు కాగా, ఇందులో అబ్ధిదారుని వాటా 20% అనగా 6 లక్షలు పోగా ప్రభుత్వం 80% అంటే 24 లక్షల రాయితీ కల్పిస్తున్నది. ఇప్పటి వరకు 13 కేజ్ కల్చర్. యూనిట్లను శ్రీరాంసాగర్, కడెం మరియు బైంసా గడ్డెన్నవాగు ప్రాజెక్టుల నందు మంజూరు చేసింది.
జిల్లాలో ప్రాథమిక మత్స్య సహకార సంఘాలు 197 ఉండగా వీటిలో 135 సంఘాలలో 7,914 మంది సభ్యులు, 62 మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలలో 3,540 మంది సభ్యులు ఉన్నారు.
సహకార సంఘాలకు 10 లక్షల యూనిట్ విలువతో 37 మత్స్య సహకార సంఘ భవనాలు మంజూరు కాగా ఇందులో ఇప్పటి వరకు 18 పూర్తి చేయబడినవి. మత్స్య పరిశ్రమపై ఆసక్తి ఉన్నవారు వారి స్వంత భూమిలో లేదా కౌలు భూమిలో చేపల చెరువు నిర్మాణం చేసుకొనుటకు అనుమతి ఇస్తామని జిల్లా కలెక్టరు, ఛైర్మెన్ మత్స్య శాఖ శ్రీ ముషారఫ్ పారుఖీ తెలిపారు. ప్రభుత్వ నిభందనలు, లబ్దిదారులకు అనుకూలతలను భట్టి 48 గంటలలో మంజూరు ఇవ్వడం జరుగుతుందన్నారు.
నిర్మల్, బైంసా, సారంగాపూర్, ఖానాపూర్ తదితర మార్కెట్లలోని మత్స్యకారులు kg చొప్పున కొర్రమీను
300, పాపేర రకం – 250, మీరుగం -100 రూ. బంగారు తీగ -100 రూ, బొత్స రకం – 120
రూపాయల చొప్పున అమ్ముతూ ఆదాయం పొందుతున్నారు.

జిల్లా పారసంబంధాల అధికారి నిర్మల్

Share This Post