DPRO NIRMAL: పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న శ్రీ గండి రామన్న హరితవనం( అర్బన్ పార్క్) తరలివస్తున్న పర్యాటకులు.

పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న శ్రీ గండి రామన్న హరితవనం( అర్బన్ పార్క్) తరలివస్తున్న పర్యాటకులు.

ప్రకృతి రమణీయతకు ఆహ్లాదకరమైన వాతావరణానికి పెట్టింది పేరుగా నిలుస్తున్న శ్రీ గండి రామన్న – హరితవనం (అర్బన్ పార్కు) నిర్మల్ జిల్లా కేంద్రం ముఖద్వారం వద్ద ఉంది. నిర్మల్ పట్టణానికి 3.29కి. మీటర్ల దూరంలో నిర్మల్ నుండి ఆదిలాబాదు వెళ్లే పాత జాతీయ రహదారి 44 కు ఆనుకుని ఉంది. ఈ పార్కు నిర్మల్ రేంజ్ చించోలి బీట్ రిజర్వు ఫారెస్ట్ బ్లాక్ లో ఉంది. ఆ రిజర్వు ఫారెస్టు కంపార్ట్మెంట్ యొక్క విస్తీర్ణం 970.240 హెక్టార్లుకాగా దానిలో నిర్మల్ నుండి 2017 – 18 సంవత్సరములో 60 హెక్టార్లను పార్కు అభివృద్ధికి కేటాయించబడింది. గౌరవ అటవీ శాఖ మంత్రివర్యులు శ్రీ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారు తేదీ 24.12.2020 న శ్రీ గండి రామన్న హరితవనం (పార్కు)ను ప్రారంభించారు. అనంతరం ఈ పార్కును 362 హెక్టార్లకు విస్తరింపచేశారు. ఈ హరిత వనం వల్ల రిజర్వు ఫారెస్టు సంరక్షణకు మంచి అవకాశం ఏర్పడింది.
నిర్మల్ పట్టణ కేంద్రంలోనే వివిధ పాఠశాలలు, కళాశాలలు, సాంకేతిక విద్యా సంస్థలు ఉండటంవల్ల ప్రతి నిత్యం అనేక మంది విద్యార్థులు ఈ పార్కును సందర్శిస్తారు. నిర్మల్ జిల్లా ప్రజలే కాకుండా జాతీయ రహదారికి ఆనుకుని ఉన్నందున రహదారిపై రాకపోకలు సాగించే ఇతర ప్రాంతాలకు చెందిన అనేకమంది సందర్శించి వినోదాన్ని పొందుతున్నారు. 1.5 లక్షల జనాభా కలిగిన నిర్మల్ పట్టణ వాసులకు ఆరోగ్యకరమైన, కాలుష్యరహిత వాతావరణాన్ని అందిస్తుంది. ఉదయం మార్నింగ్ వాకర్స్, మరియు సీనియర్ సిటిజన్స్ కు పట్టణానికి దగ్గరగా పరిశుభ్ర ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తుంది. రూ.లు 189.805 లక్షల వ్యయంతో వివిధ రకాల వసతులతో వైద్యుల సలహాతో ఏర్పాటుచేసిన మెడికల్ వాకింగ్ ట్రాక్, పిల్లల పార్కు, స్వచ్ఛమైన మంచినీటి సౌకర్యం, ఎత్తయిన టవర్లు, వంతెనలు జింకల సంరక్షణ కేంద్రం, పునరావాస కేంద్రం మొదలైనవి ఏర్పాటు చేశారు. 20 మీటర్ల ఎత్తులో నిర్మించిన టవర్ పై నుండి చూస్తే నిర్మల్ పట్టణంతోపాటు పచ్చని అటవీ ప్రాంతం కనులవిందుగా కనిపిస్తుంది. ఉదయం పూట వందల సంఖ్యలో దర్శనమిచ్చే నెమళ్లు రకరకాల పక్షుల కిలకిల రావాలతో మార్నింగ్ వాకర్స్ ఆహ్లాదం కలుగుతుంది. చెట్ల మధ్యలో ఏర్పాటు చేసిన ర్యాంపు లపై సందర్శకులు నడుస్తున్నప్పుడు ఇరువైపులా వింత అనుభూతిని పొందుతారు.
ఈ పార్కులో జింకలకు, కోతులకు కూడా సంరక్షణ కేంద్రాలు కలవు. పార్కులో సందర్శకులకు ప్రవేశ రుసుము మరియు సఫారీ వాహనము సౌకర్యం ద్వారా ఇప్పటి వరకు రూ. 15 లక్షల 25 వేల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు.
ఇంకా వేల సంఖ్యలో మొక్కలను నాటి పచ్చదనాన్ని, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.

***************************జిల్లా పౌరసంబంధాల అధికారి నిర్మల్.

Share This Post