సెప్టెంబర్ 01 నుండి అన్ని పాఠశాలలు ప్రారంభించ నున్నందున స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అన్ని పాఠశాలలో పారిశుద్ద్య పనులు పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి అన్నారు.
మంగళవారం రోజున హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్లు, మున్సిపల్ నగర పాలక సంస్థ చైర్మన్లు, జిల్లా విధ్యాధికారులు, జిల్లా పంచాయితీ అధికారులతో పాఠశాలల పునః ప్రారంభం, పారిశుద్ద్య పనుల నిర్వాహణ పై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోవిడ్ కారణంగా పాఠశాలలు తిరిగి 16 నెలల తర్వాత సెప్టెంబర్ 01 నుండి ప్రారంభించుకుంటున్నామని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాఠశాలల్లో పారిశుద్ద్య పనులు, మౌలిక సదుపాయాల కల్పన చేపట్టాలని అన్నారు. పాఠశాలల్లో ప్రతి తరగతి గది ని ఫర్నిచర్ ను శుభ్రపరచాలని అన్నారు. పాఠశాలను నీటితో కడిగించి రసాయనాలను పిచికారీ చేయించాలని, ముఖ్యంగా మరుగుదొడ్లను శుభ్రం చేయించాలని అన్నారు. పాఠశాలల్లోని కిచేన్ షెడ్డులను ప్రత్యేకంగా శుబ్రం చేయించాలని అన్నారు. ప్రతి పాఠశాలకు మిషన్ భగీరథ ద్వారా నళ్లా నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని, ప్రతీ విద్యార్థి తప్పని సరిగా మాస్కులు ధరించి పాఠశాలలకు రావాలని, భౌతిక దూరం పాటించే విధంగా ఏర్పాట్లు చేయాలని అన్నారు. ప్రైవేట్ పాఠశాలలో కూడా పారిశుద్ద్య పనులు చేపట్టేలా జిల్లా విద్యా శాఖాధికారులు పర్యవేక్షించాలని అన్నారు. ప్రైవేట్ పాఠశాలల బస్సులలో విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకొవాలని అన్నారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల పారిశుద్ద్య చర్యల భాద్యత ఆయా గ్రామ పంచాయితీలదేనని తెలిపారు. పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలలో పారిశుద్ద్య పనులలో గ్రామ సర్పంచు, ఎం.పి.పి.లు, జడ్పీటిసిలు, వార్డు మెంబర్లు, గ్రామాల్లోని ప్రజాప్రతినిధులందరూ భాగస్వామ్యులు కావాలని అన్నారు. ఆగష్టు 30 లోగా అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో పూర్తి స్థాయిలో పారిశుద్ద్య పనులు నిర్వహించి ప్రారంభానికి సిద్ధంగా ఉంచినట్లు సంబంధిత ప్రధానోపాధ్యాయులు సర్టిఫికెట్ ను జిల్లాల కలెక్టర్ లకు సమర్పించాలని తెలిపారు. పాఠశాలలు ప్రారంభం అయిన తర్వాత ప్రతి రోజు జడ్పీ చైర్మన్లు, కలెక్టర్లు, జిల్లా విద్యాధికారులు, జిల్లా పంచాయితీ అధికారులు, ఎం.పి.డి.వో.లు, మండల విద్యాధికారులు, మండల పంచాయితీ అధికారులు పాఠశాలలను సందర్శిస్తూ పారిశుద్ద్య కార్యక్రమాలు కొనసాగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. కొంత మంది విద్యార్థుల తల్లిదండ్రులు కోవిడ్ థర్డ్ వేవ్ వస్తుందనే భయందోళనలో ఉన్నారని, విద్యార్థులను ఎవరిని బలవంతంగా పాఠశాలలకు తీసుకురావద్దని అన్నారు. కోవిడ్ నిబంధనల మేరకే స్వచ్చందంగా వచ్చే విద్యార్థులకు పాఠశాలల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. పాఠశాలలో ఎవరైనా ఒక విద్యార్థికి దగ్గు, జలుబు, జ్వరము వంటి కోవిడ్ లక్షణాలతో ఉంటే వెంటనే సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కెంద్రంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్థికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయిన పక్షంలో ఆ విద్యార్థి తరగతి గదిలో ఉన్న ప్రైమరీ కాంటాక్ట్ విద్యార్థులను గుర్తించి అందరికి కోవిడ్ పరీక్షలు చేయించాలని అన్నారు.
రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ అన్ని పాఠశాలల్లో, అంగన్ వాడీ కేంద్రాలలో పకడ్బందీ పారిశుద్ద్య చర్యలు చేపట్టి పండుగ వాతావరణంలో సెప్టెంబర్ 01 న పాఠశాలలను పునః ప్రారంభించాలని అన్నారు. ప్రతి రోజు పాఠశాలల్లో పారిశుద్ద్య చర్యలు గ్రామ పంచాయితీ ద్వారా నిర్వహించాలని ఆదేశించారు. పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలను తొలగించాలని, నీటి నిల్వలు లేకుండా మట్టి వేయించాలని అన్నారు. అన్ని పాఠశాలల్లో తల్లిదండ్రుల కమిటీలు, విద్యార్థుల కమిటీలు ఏర్పాటు చేసి పరిశుభ్రమైన పరిసరాలలో పాఠశాలల్లో విద్యా భోదన చేయుటకు చర్యలు తీసుకొవాలని సూచించారు. పాఠశాలలో పారిశుద్ద్య పనుల నిర్వాహణ భాద్యత గ్రామ పంచాయితీలదేనని పంచాయితీ రాజ్ చట్టంలో ఉందని మంత్రి అన్నారు. ప్రతి పాఠశాలల్లో మిషన్ భగీరథ నళ్లా ఉండాలని సంబంధిత ఏ.ఈ.లు పాఠశాలను సందర్శించి లేనిచోట నళ్లాలను అమార్చాలని ఆదేశించారు. ప్రతి విద్యార్థి మాస్కు ధరించి పాఠశాలకు వచ్చేలా చర్యలు తీసుకొవాలని జిల్లా విద్యాధికారులకు సూచించారు. అన్ని మున్సిపాలిటీలలో, నగరపాలక సంస్థల పరిధిలోని పాఠశాలలో, అంగన్వాడీ కెంద్రాలలో ఈగలు, దోమలు లేకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. ఈ కార్యక్రమాలలో ఆశ్రద్ద కనబరిచిన అధికారులు , ప్రజాప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
కలెక్టర్ కార్యాలయ వీడియో కన్ఫరెన్స్ హాలు నుండి జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారుఖీ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా జిల్లాలో గిరిజన ప్రాంతాలతో పాటు ఇతర పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించవలసి ఉందని తెలిపారు. గ్రామ, మండల, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయముతో ప్రతి పాఠశాలలో పరిసరాల పరిశుభ్రత, కిచెన్, మరుగుదొడ్లు, త్రాగునీరు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వివరించారు.
ఈ వీడియో కాన్పరెన్సులో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మి,అదనపు కలెక్టర్ (రెవెన్యూ ) రాంబాబు, జడ్.పి సిఈఓ సుదీర్, డీఈఓ ప్రణిత, డీపీఓ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి నిర్మల్ చే జారీ చేయడమైనది.