DPRO NIRMAL: ప్రయివేటు కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు.

ప్రయివేటు కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు…
ప్రభుత్వ ప్రోత్సాహం…. అధికారుల కృషి….. వెరసి ప్రభుత్వ బడులకు విద్యార్థుల వలస….
నిర్మల్ జిల్లాలో ఆశాజనకంగా బలోపేతమవుతున్న సర్కారు బడులు.
నేను రాను సారు…… సర్కారు బడికి…… అనే రోజులు పోయి, నేను వస్తాను సారు సర్కారు బడికి అనే రోజులు వచ్చాయి. గతంలో ప్రయివేటు పాఠశాలల వైపు మొగ్గు చూపిన విద్యార్థుల తల్లిదండ్రులు నేడు వారి పిల్లలను సర్కారు బడుల్లో చేర్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా అన్ని వసతులతో ప్రభుత్వ పాఠశాలలకు భవనాలు, మధ్యాహ్నం భోజనంతో పాటు నాణ్యమైన విద్య ప్రమాణాలతో ఖర్చు లేకుండా ప్రభుత్వం అందిస్తున్నందున ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంది.
నిర్మల్ జిల్లాలో ఏకంగా 6,070 మంది విద్యార్ధులు వివిధ ప్రైవేటు పాఠశాలల నుండి సర్కారు బడుల్లో చేరడాన్ని పరిశీలిస్తే ఈ మార్పు రాబోయే రోజుల్లో ఇంకా గొప్పగా ఉంటుందని అర్థమవుతోంది. జిల్లాకు చెందిన దేవాదాయ, అటవీ న్యాయ మరియు పర్యావరణ శాఖా మాత్యులు శ్రీ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు బాటలు వేస్తూ విద్యా వ్యవస్థపై దృష్టి సారించారు. జిల్లా కలెక్టరు పర్యవేక్షణ,జిల్లా విద్యా శాఖాధికారి దృఢసంకల్పం ప్రభుత్వ బడుల బలోపేతానికి దోహదపడుతున్నవి.
నిర్మల్ జిల్లాలో మొత్తం 862 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 162 ఉన్నత పాఠశాలలు, 102 ప్రాథమికోన్నత పాఠశాలలు కాగా, ప్రాథమిక పాఠశాలలు 598 ఉన్నాయి. ఈ విద్యాసంవత్సరంలో ఉన్నత పాఠశాలల్లో 1264 మంది ప్రాథమిక పాఠశాలలో 4540 మంది విద్యార్థులు చేరి విద్యనభ్యసిస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 16 మంది ఉపాధ్యాయులు సైతం తమ పిల్లలను సర్కార్ బడుల్లో చేర్చి ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వ బడులతో పాటు గురుకుల పాఠశాలలు, మోడల్ స్కూళ్లలో ప్రవేశం కోసం నిర్వహించే పరీక్షలకు సైతం విద్యార్థుల నుండి పోటీ ఎదురవుతుంది. ఈ విద్యా సంస్థల్లో ఎలాగైనా తమ పిల్లలకు సీటు దక్కాలని తల్లిదండ్రులు ఏడాదిపాటు కోచింగ్ ఇప్పిస్తున్నారు. ఒక్కొక్క సీటుకు 80 నుండి 100 మంది విద్యార్ధులు పోటీపడుతున్నారంటే ప్రభుత్వ గురుకులాల పట్ల ఆదరణ ఏ మేరకు పెరిగిందో తెలుస్తుంది.
1. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని మా కుమారుడు అయిలోళ్ళ ఆదర్శ గౌడ్ ను ప్రైవేటు స్కూల్ నుండి తీసి కొండాపూర్ జిల్లా పరిషత్ స్కూల్లో చేర్పించామని నిర్మల్ మండలం రాయపూర్కాండ్లీ లో తెలుగు పండిత్ గా పనిచేస్తున్న శ్రీమతి కవిత తెలిపారు.
2. మా అబ్బాయిని ప్రభుత్వ స్కూల్లో చదివిస్తున్నాం- ప్రయివేటు బడుల కన్నా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు రోజురోజుకు పెరుగుతున్నందున మా అబ్బాయి రాజా శ్రీ హర్ష ను 4వ తరగతిలో తాను పనిచేస్తున్న మేడిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో నే చేర్పించినట్టు స్కూల్ అసిస్టెంట్ శ్రీ నాగరాజు తెలిపారు.
3. మా బాబును ప్రభుత్వ స్కూల్లో చదివిస్తున్న- మంచి క్రమశిక్షణతో కూడిన విద్యను తమ కుమారుడికి అందించాలనే లక్ష్యంతో తన కుమారుడు శశాంక్ ను తాను పనిచేస్తున్న పాఠశాల బోసి గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి చదివిస్తున్నానని స్కూల్ అసిస్టెంట్ శ్రీ బి సుధాకర్ తెలిపారు.
తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్న 16 మంది ఉపాధ్యాయులను జిల్లా మంత్రి శ్రీ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల సందర్బంగా సన్మానించారు.

Share This Post