DPRO NIRMAL: బాసర జ్ఞాన సరస్వతి దేవాలయ అభివృద్ధికి 50 కోట్లు… ​రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ, న్యాయ శాఖ మాత్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

పత్రికా ప్రకటన తేది: 12.10.2021
బాసరలోని జ్ఞాన సరస్వతి దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం 50 కోట్లు కేటాయించిందని రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ మరియు న్యాయ శాఖా మాత్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా మంగళవారం మూలా నక్షత్రం ను పురస్కరించుకొని మంత్రి సతీసమేతంగా ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పించారు. ఆలయ అధికారులు వేదమంత్రాల నడుమ పూర్ణ కుంభం తో మంత్రి దంపతులకు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శ్రీ సరస్వతీదేవి కృప వల్ల మంచి విద్య, జ్ఞానం లభిస్తుందని అన్నారు. బాసర దేవాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం 50 కోట్లు కేటాయించిందన్నారు. 44 వసతి గృహాల నిర్మాణం త్వరలో చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే 8.5 కోట్ల ఖర్చుతో వసతి గృహాలు నిర్మించినట్లు తెలిపారు. వ్యాసమహర్షి స్వయంగా ఇసుకతో సరస్వతీదేవిని తయారుచేశారని, మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని సందర్శించి అక్షరాభ్యాసం చేసుకున్న అనేక మంది విద్యార్థులు ఉన్నత హోదాలు పొందారని తెలిపారు. IAS, IPS, న్యాయమూర్తులుగా విశిష్ట సేవలను అందిస్తున్నారని తెలిపారు. దేవీ నవరాత్రుల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పోలీసు భద్రత, మంచినీటి సౌకర్యం, సీ.సీ. కెమెరాలతో పర్యవేక్షణ తదితర సౌకర్యాలు కల్పించామన్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయానా భక్తుడు అయినందున రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. రూపాయలు 200కోట్ల ఖర్చుతో యాదాద్రి శ్రీలక్ష్మీ నర్సింహ స్వామి ఆలయాన్ని దేశంలోనే చారిత్రాత్మకంగా నిర్మించారని అన్నారు. ఈ ఆలయం తెలంగాణాలో తిరుపతిగా విరాజిల్లుతుందన్నారు. రాబోయే 2 నెలల్లో ఈ ఆలయాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. కాళేశ్వరం, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుల క్రింద రైతులకు సాగునీరు అందించడం వలన పంటలు బాగా పండుతున్నాయాన్నారు. కరోనా మూలంగా 40వేల కోట్ల ప్రభుత్వం ఆదాయం పడిపోయిందని త్వరలో ముథోల్ శాసనసభ్యులు శ్రీ విఠల్ రెడ్డి తో సమావేశమై ఆలయ అభివృద్ధిపై చర్చిస్తామని పేర్కొన్నారు. జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీకి వైస్ ఛాన్సలర్ను త్వరలో నియమిస్తామని ప్రతి సంవత్సరం ఇందులో 1500 మంది ప్రవేశం పొందుతున్నరన్నారు. దీనిలో చదువుకున్న విద్యార్థులు 60 శాతం మంది విద్యార్థులకు ఉద్యోగాలు పొందారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి కొరిపెల్లి విజయలక్ష్మి రాంకిషన్ రెడ్డి, ముథోల్ శాసనసభ్యులు శ్రీ విట్టల్ రెడ్డి, ఈవో వినోద్, సర్పంచ్ లక్ష్మణ్ రావ్ తదితరులు పాల్గొన్నారు.

***************జారీ చేయివారు: జిల్లా పౌరసంబంధాల అధికారి, నిర్మల్.

Share This Post