DPRO NIRMAL: రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అమలు : ప్రతి నియోజకవర్గంలో 100 మంది లబ్ధిదారుల ఎంపిక : రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, చీఫ్ సెక్రటరీ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణ:

 

 

పత్రికా ప్రకటన తేదీ: 22-1-2022 రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అమలు : ప్రతి నియోజకవర్గంలో 100 మంది లబ్ధిదారుల ఎంపిక :
రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, చీఫ్ సెక్రటరీ
జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణ:

*
గౌ.రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు పథకం అమలు చేస్తామని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.

శనివారం దళిత బంధు పథకం అమలు పై జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ దళితుల అభివృద్ధిని కాంక్షిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం లో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన దళిత బంధు పథకం సత్ఫలితాలనిస్తుందన్నారు ఈ క్రమంలో ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయుటకు నిర్ణయించారనీ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 118 నియోజకవర్గాల్లో మొదటిదశలో నియోజకవర్గానికి 100 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసి దళిత బంధు పథకం అమలు చేస్తామని అన్నారు. ఆయా నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులు సమావేశాలు పెట్టుకొని ఫిబ్రవరి 5వ తేదీ లోగా అర్హులైన లబ్ధిదారుల జాబితా సిద్ధం చేసి అందించాలని సూచించారు. మార్చి నెల 7వ తేదీలోగా ఎంపిక చేసిన లబ్ధిదారులకు యూనిట్లను గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మాట్లాడుతూ దళిత బంధు పథకం ద్వారా లబ్ధిదారులకు రూ. 10 లక్షలను వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని, ఇందులో నుండి రూ. 10వేలు లబ్ధిదారులకు రక్షణ నిధి గా ఉంటుందని అన్నారు. ఫిబ్రవరి 5వ తేదీ లోగా అర్హులైన లబ్ధిదారులను గుర్తించడంతో పాటు, వారికి బ్యాంకు ఖాతాలు తెరిపించాలని కలెక్టర్లను ఆదేశించారు. లబ్ధిదారులు లాభసాటి యూనిట్లను ఎంపిక చేసుకునేలా వారికి అవగాహన కల్పించాలని సూచించారు. దశలవారీగా అన్ని నియోజకవర్గాల్లో ని అర్హులైన దళిత కుటుంబాల అందరికీ దళిత బంధు పథకం అమలవుతుందని తెలిపారు. మార్చి నెల 7వ తేదీలోగా లబ్ధిదారుల ఎంపిక చేసుకున్న యూనిట్లను కలెక్టర్లు గ్రౌండింగ్ చేయాలని అన్నారు. దళిత బంధు పథకం అమలుకు ఈరోజు రూ. 100 కోట్లు విడుదలయ్యాయనీ, మరో రెండు మూడు రోజుల్లో రూ. 12 వందల కోట్లు విడుదల చేసి జిల్ల కలెక్టర్ల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది అని తెలిపారు. నియోజకవర్గంలో నీ గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రత్యేక అధికారులను నియమించాలని కలెక్టర్లను ఆదేశించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ దళిత బంధు పథకం అమలు, లబ్ధిదారుల ఎంపిక, బ్యాంకు ఖాతాలు తెరువడం, జాబితాలు సిద్ధం చేయడం యూనిట్లను గ్రౌండింగ్ చేయడం తదితర అంశాలపై సమీక్షించారు.

రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ మాట్లాడుతూ దళిత బందు లబ్ధిదారులను ఎంపిక చేసే అధికారులు, ప్రత్యేక అధికారులకు ముందుగానే స్పష్టమైన సూచనలు ఇవ్వాలని కలెక్టర్లను కోరారు. దళిత బంధు పథకం ఫలాలు దళితులు అందుకుంటున్నారని తెలిపారు. దళిత బంధు పథకం దళిత కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నాయని అన్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర మంతా దళిత బంధు పథకం అమలు చేయాలని నిర్ణయించడం అభినందనీయమని అన్నారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషరాఫ్ ఫారూకి మాట్లాడుతూ బ్యాంకు ఖాతా తెరచినామని, మంత్రి శాసనసభ్యులతో కలిసి సమావేశం జరిగిందని, లబ్ధిదారులు ఎంపిక గ్రౌండింగ్ కు సిద్ధం చేస్తున్నామని వివరించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్ఖడే జడ్పీ సీఈఓ సుధీర్, ఎస్సి కార్పొరేషన్ ఈ డి హనుమండ్లు,అన్ని శాఖల జిల్లా అధికారులు హాజరైనారు. జిల్లా పౌర సంబంధాల అధికారి, నిర్మల్ చే జారీ చేయనైనది.

Share This Post