DPRO NIRMAL: వరి ధాన్యం కొనుగోలుపై మంత్రి సమీక్షా సమావేశం.

పత్రికా ప్రకటన తేది: 13.10.2021
వరి ధాన్యం కొనుగోలుపై మంత్రి సమీక్షా సమావేశం
వరి ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు చేసేందుకుగాను తీసుకోవాల్సిన చర్యలు తగు ఏర్పాట్లు తదితర అంశాలపై బుధవారం జిల్లా కలెక్టర్ సమావేశం మందిరంలో సంబంధిత అధికారులు, రైతు సమన్వయ కమిటీ, ప్రజా ప్రతినిధులు, రైస్ మిల్లర్లతో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన రాష్ట్ర దేవాదాయ, న్యాయ, అటవీ, పర్యావరణ శాఖా మాత్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ వరిధాన్యం గ్రేడ్ A ధర క్వింటాలుకు రూపాయలు 1960/- గానూ, సాధారణ వరిధాన్యం క్వింటాలుకు ధర రూ. 1940/- ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. IKP, PACS, జీసీసీ మరియు DCMష్ ల ద్వారా కొనుగోలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని మంత్రి అన్నారు. జిల్లాల్లో 185 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. గన్నీబ్యాగుల కొరత, రవాణా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 1.80 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండించగా FCI 60 లక్షల మెట్రిక్ టన్నుల వరకే కొనుగోలు చేసేందుకు అంగీకరించిందని మంత్రి అన్నారు. 2 వ పంట కింద వరి సాగు చేయకుండా రైతులు వారిని ప్రత్యామ్నాయ పంటల దిశగా చైతన్యపర్చేందుకు అధికారులు కృషి చేయాలని అన్నారు. ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రాయితీపై విత్తనాలు అందిస్తుందన్నారు. కేరళ, బెంగాల్, తమిళనాడు మరియు ఒరిస్సా రాష్ట్రాలలో అక్కడి రైతులు వరి సాగు చేస్తున్నందున మన రాష్ట్రం నుండి బియ్యం ఎగుమతి లేకుండా పోయిందన్నారు. 35° ఊష్ణోగ్రత దాటితే వరిధాన్యం నాణ్యత కోల్పోతుందని దీంతో రైతులు నష్టపోవాల్సి వస్తుందని అన్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగుపై ఆసక్తి ఉన్న రైతుల జాబితా రూపొందించాలన్నారు.
జిల్లా కలెక్టర్ శ్రీ ముషార్రఫ్ ఫారూఖి మాట్లాడుతూ నిర్మల్ జిల్లా లో గత సంవత్సరం కంటే ఈ సారి 35% ఎక్కువ వరి పంట దిగుబడి వస్తుందని అంచనా వేశామన్నారు. గతంలోచిన్న చిన్న సమస్యలు ఎదుర్కోవడం జరిగిందని ఈసారి అవి పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 6 లక్షల గన్నీ బ్యాగులు అదనంగా నిల్వ ఉన్నాయన్నారు. రైతులను దళారులు మోసగిస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వరి ధాన్యాన్ని శుభ్రపరిచి కొనుగోలు కేంద్రానికి పంపినట్లయితే కొనుగోళ్లు త్వరగా జరగడమే కాకుండా రైతులకు ధాన్యం కోత విధించడం జరగదని తెలిపారు. ఖానాపూర్ శాసన సభ్యురాలు శ్రీమతి రేఖా నాయక్ మాట్లాడుతూ కడెం, ఖానాపూర్ వరి పంట దిగుబడి అధికంగా ఉన్నందున అధికారులు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, రైతులకు అవగాహన కల్పించుటకు సర్పంచులు, రైతులతో సమావేశం నిర్వహించాలని కోరారు.
అదనపు కలెక్టర్ శ్రీ పి రాంబాబు మాట్లాడుతూ పండుగ తర్వాత ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తామని అన్నారు. టార్పలిన్లు, క్లీనర్స్ ఎలక్ట్రానిక్ వేయింగ్ కాంటాలు, తేమశాతాన్ని గుర్తించేందుకు మాయిశ్చర్ మీటర్లు ఏర్పాటు చేస్తామన్నారు.
ఈ సమావేశంలో రైతు సమన్వయ సమితి చైర్మన్ శ్రీ వెంకట్రాంరెడ్డి, DCCB చైర్మెన్ రఘునందన్ రెడ్డి, DCMS అధ్యక్షులు లింగయ్య, జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రీ అంజిప్రసాద్, DCO శ్రీ శ్రీనివాసరెడ్డి , DMO అషఫాక్ అహ్మద్, DRDO శ్రీ వెంకటేశ్వర రావ్, DM&DCSO సుధ రాణి డిప్యూటీ తహశీల్దార్లు, అసిస్టెంట్ రిజిస్టార్ జీ సాయినాథ్ లు, రైస్ మిల్లర్ల యజమానులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సీఈవోలు తదితరులు పాల్గొన్నారు.

************* జారీ చేయువారు: జిల్లా పౌరసంబంధాల అధికారి, నిర్మల్.

Share This Post