DPRO NIRMAL: వైద్యాధికారులు సమయపాలన పాటించని పక్షంలో చర్యలు తప్పవని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హెచ్చరించారు.

పత్రికా ప్రకటన తేది: 09.11.2021
వైద్యాధికారులు సమయపాలన పాటించని పక్షంలో చర్యలు తప్పవని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హెచ్చరించారు.
మంగళవారం నిర్మల్ ఏరియా ఆస్పత్రిలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి కొరిపెల్లి విజయలక్ష్మి అధ్యక్షతన మంత్రి ముఖ్య అతిథిగా హాజరై రూ 1.3 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ ను మంత్రి ప్రారంభించారు. ఈ ప్లాంటు ద్వారా 500 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. ఒకేసారి 100 మందికి ప్రాణవాయువు అందేలా అవకాశం ఏర్పడుతుంది. అనంతరం జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఉదయం డాక్టర్లు సమయపాలన పాటిస్తు మానవ సేవ చేయాలని సూచించారు. విధులను నిర్లక్ష్యం వహించిన వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. భైంసా ఏరియా ఆస్పత్రి లో జరిగిన సంఘటన పునరావృతం కావద్దని అన్నారు. ప్రజలు డాక్టర్లపై ఎంతో నమ్మకంతో, ధైర్యంతో ఆస్పత్రికి వస్తారని, వారికి భరోసా కల్పించాలని మంత్రి సూచించారు. కరోనా సమయంలో ఆక్సిజన్ అందక ఇబ్బందులు ఎదుర్కొన్నామని కరోనా మూడవ వేవ్ పొంచి ఉన్నందున ఆక్సిజన్ ప్లాంట్ రావడం శుభపరిణామం అని అన్నారు. ప్రభుత్వం నిర్మల్ ఆస్పత్రి అభివృద్ధికి 48.88 కోట్లు మంజూరు చేసిందన్నారు. ప్రాంతీయ ఆస్పత్రి నిర్మాణం చీఫ్ ఇంజినీర్ తో మాట్లాడగా 25 నుండి 30 కోట్ల ఖర్చు అంచనా వేశారన్నారు. త్వరలో ఈ ఆస్పత్రి కూడా నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు ఇప్పుడున్న ఆస్పత్రిలో 250 పడకల ఆస్పత్రిగా తీర్చిదిద్దేందుకు 25 కోట్లు కేటాయించారని, త్వరలో పనులు ప్రారంభమవుతాయన్నారు. పనులు పూర్తయినాక వైద్య పరికరాలు కోసం 10 కోట్లు అవసరం అన్నారు. రాబోయే రోజుల్లో నిర్మల్ కు వైద్య కళాశాల మంజూరు అవుతున్నందున, ఆ కళాశాలకు 350 పడకల ఆస్పత్రిని అందుబాటులోకి తేవాల్సి ఉందన్నారు. నిర్మల్ భైంసా ఆస్పత్రులకు అంబులెన్స్ ఆవశ్యకత ఉన్నదన్నారు
కరోనా టెస్టుల కు వేరే ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా జిల్లాలో 2.5 కోట్ల వ్యయంతో ఆర్టీపీసీఆర్ ల్యాబ్ ను ఏర్పాటు చేశామన్నారు. 5 పడకల డయాలసిస్ సెంటర్ ను 10 పడకలకు పెంచడమైనదని, ఇప్పటివరకు 213 పేషెంట్స్ కు 20,927 సార్లు రక్త శుద్ధీకరణ జరిగిందన్నారు. 53 రకాల రక్త పరీక్షలు నిర్వహించుటకు కొత్తగా 3.3 కోట్లతో డయోగ్నోసిస్ హబ్ ను నిర్మించడం జరిగిందని తెలిపారు. సుమారు 30 లక్షల వ్యయంతో ఆస్పత్రి సుందరీకరణ చేయడమైనది మంత్రి తెలిపారు. మెటర్నిటీ ఆస్పత్రిలో 60 లక్షల వ్య యంతో ఓపీబ్లాక్ నిర్మించడం అయిందన్నారు.
జిల్లా కలెక్టర్ శ్రీ ముషార్రఫ్ ఫారూఖి మాట్లాడుతూ వైద్యాధికారులు, సిబ్బంది అంకితభావంతో పనిచేస్తూ జిల్లాకు మంచిపేరు తేవాలని కోరారు. ఆపదలో ఉన్నవారికి సకాలంలో వైద్యం అందించాలన్నారు. ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరే మహిళలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. బ్లడ్ బ్యాంక్ లైసెన్స్ రెన్యువల్ కు త్వరలోపై అధికారులతో మాట్లాడతానని అన్నారు. బైంసా ఆసుపత్రిలో బాలింత మృతి దురదృష్టకరమని ముథోల్ శాసనసభ్యులు శ్రీ విట్టల్ రెడ్డి అన్నారు. బాసరలో భక్తుల రాక, మరియు పాము కాటు కేసులు ఎక్కువగా అవు తున్నందున ఆంబులెన్స్ల ఆవశ్యకత ఉందని కోరారు.
నిర్మల్ ఏరియా ఆస్పత్రిలో డాక్టర్ పోస్టుల భర్తీ మరియు మార్చురీ యందు షెడ్ నిర్మాణానికి అనుమతినిస్తు తీర్మానించడమైంది. రాత్రి విధులు నిర్వర్తించే డాక్టర్లకు వసతులు కల్పించేందుకు, ల్యాబ్ టెక్నీషియన్ డిప్యూటేషన్ పై వే యుటకు నిర్ణయించారు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ కి ఎచ్ డి ఎస్ నిధులను వినియోగించేందుకు అనుమతిస్తూ తీర్మానించానైనది

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీ హేమంత్ బోర్కడే, ఆస్పత్రి సూపరిండెంట్ శ్రీ దేవేందర్ రెడ్డి, ఎంసీహెచ్ డా॥రజినీ, సారంగపూర్ జెడ్పీటీసీ శ్రీ రాజేశ్వర్ రెడ్డి, నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, బాసర్ ఎంపీపీ శ్రీమతి సుశీల బాయి, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు శ్రీ గంగారెడ్డి, వైద్యాధికారులు హాజరైనారు.
జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి నిర్మల్ చే జారీ చేయనైనది.

Share This Post