DPRO NIRMAL:

పత్రికా ప్రకటన తేది: 06.11.2021
పోడు భూముల సమస్యల పరిష్కారానికి ఈ నెల 8 నుండి దరఖాస్తులు తీసుకోనున్న నేపథ్యంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్ శ్రీ ముషారఫ్ ఫారుఖి అన్నారు.
శనివారం ఆర్ఆర్ గార్డెన్ లో పోడు భూముల సమస్యల పరిష్కారానికై ధరఖాస్తుల స్వీకరణ లో భాగంగా అటవీ, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ పోడు భూముల సమస్యను ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటుందన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 8 నుండి దరఖాస్తుల స్వీకరణ చేపట్టి డిసెంబర్ 8 వరకు కొనసాగుతుందన్నారు. అర్హులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టా మరియు అటవీ భూములను రక్షించడం ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశమన్నారు. దరఖాస్తుల స్వీకరణకు అధికారులు ఎలాంటి అలసత్వం వహించరాదని కలెక్టర్ హెచ్చరించారు. గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయి కమిటీలతో పాటు అటవీ హక్కుల కమిటీ కూడా ఉంటుందన్నారు. గ్రామ స్థాయి కమిటీ పాత్ర కీలకమని, ఈ కమిటీలు 3 సార్లు సమావేశం నిర్వహించవలసి ఉంటుందని సమావేశం నిర్వహించిన తేదీ, సమయం వేసి సంతకం చేయాలని తెలిపారు.దరఖాస్తులు, తీర్మానాలు, డిస్పాచ్ లకు రిజిస్టర్లు తప్పక నిర్వహించాలన్నారు. ప్రతి ఒక్కరి దరఖాస్తులు స్వీకరించాలని మొదట సమావేశం ఏర్పాటుచేసి దరఖాస్తుదారులకు అవగాహన కల్పించి రెండు,మూడు రోజుల అనంతరం గ్రామసభ నిర్వహించి దరఖాస్తులు తీసుకుని క్షేత్ర పరిశీలన చేయాలన్నారు.
మండల స్థాయి కమిటీలు ప్రతి సోమవరం గ్రామపంచాయతీ కమిటీలను విజిట్ చేయాలన్నారు. ప్రతి రోజు కలెక్టర్ కంట్రోల్ రూమ్ కు సంతకంతో కూడిన నివేదికను పంపాలని తెలిపారు. ఎక్కువ గ్రామ పంచాయతీలు ఉంటే ప్రతి గ్రామంలో, హ్యాబిటేషన్లలో ను సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. సమావేశంలలో పోడు రైతులకు సవివరంగా సమాచారం అందించాలని కలెక్టర్ అన్నారు. జిల్లా లో పోడు ఆక్రమణకు గురైన 100 గ్రామాలే కాక, ఇంకా ఏమైనా గ్రామాల్లో కూడా ఉంటే పరిశీలించాలని తెలిపారు. ఎక్కువగా ఆక్రమణకు గురైన మండలాల్లో అవసరమైన చోట అదనపు సిబ్బందిని కేటాయించాలని, అదనపు కలెక్టర్లు రెవెన్యూ డివిజన్ అధికారికి సూచించారు.
జిల్లాలో 6,200 మంది పోడు వ్యవసాయం చేస్తున్నారని ఇందులో 1000 మంది నాన్ ఎస్టీలు ఉన్నారని తెలిపారు. ఎఫ్ఆర్సీ కమిటీలలో 10-15 మంది సభ్యులు ఉండాలని, అందులో ¾ వంతు మంది గిరిజనులు కాగా వారిలో 1/3 వంతు మహిళలు సభ్యులుగా చేర్చాలన్నారు.
జిల్లా అటవీ అధికారి శ్రీ వికాస్ మీనా మాట్లాడుతూ జిల్లాలో 396 గ్రామ పంచాయతీలలో 100 గ్రామపంచాయతీలు పోడు భూముల ఆక్రమణలో ఉన్నాయని అన్నారు. 2005 డిసెంబరు 13 కన్నా ముందు సాగులో ఉన్న వారు హక్కుపత్రాలు పొందడానికి అర్హులని, ఇతరులు అయితే 1930 నుండి సాగు చేస్తున్నట్టు ఆధారాలు ఉండాలని తెలిపారు.
ఈ సమావేశం లో అదనపు కలెక్టర్లు శ్రీ హేమంత్ బోర్కడే, శ్రీ పి. రాంబాబు, డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్, శ్రీ సిధార్థ విక్రమ్ సింగ్ జిల్లా గిరిజన సంక్షేమ అధికారి శ్రీనివాస్ రెడ్డి, డీపీవో వెంకటేశ్వర్లు, అటవీ, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు తదితరులు హాజరయ్యారు.

********************జిల్లా పౌరసంబంధాల అధికారి, నిర్మల్ చే జారీ చేయనైనది.

Share This Post