DPRO NIRMAL: 2005 తర్వాత గిరిజనుల సాగులో ఉన్న అటవీ భూముల వివరాలను వెంటనే అటవీశాఖ అధికారులు సబ్ కమిటీకి అందజేయాలని రాష్ట్ర అటవీ,పర్యావరణ, న్యాయ దేవాదాయ శాఖా మాత్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు.

పత్రికా ప్రకటన తేదీ: 22.09.2021
2005 తర్వాత గిరిజనుల సాగులో ఉన్న అటవీ భూముల వివరాలను వెంటనే అటవీశాఖ అధికారులు సబ్ కమిటీకి అందజేయాలని రాష్ట్ర అటవీ,పర్యావరణ, న్యాయ దేవాదాయ శాఖా మాత్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు.
బుధవారం నిర్మల్ లోని దివ్య గార్డెన్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమీక్షా సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2005 సం॥ క్రితం నుండి గిరిజనుల సాగులో ఉన్న పోడు భూములకు RFR పాసుపుస్తకాలు అందించడం జరిగిందన్నారు. అర్హత ఉన్న ప్రతి గిరిజనుడు సాగు చేసుకుంటున్న భూమికి హక్కు పత్రాలు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. స్థానిక సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించే లక్ష్యంతో జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించడమైనదన్నారు.
వ్యాక్సినేషన్ కార్యక్రమం లో నూటికి నూరు శాతం విజయవంతం చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలన్నారు. మండల స్థాయి సమావేశాల అజెండాలో వ్యాక్సినేషన్ అంశాన్ని చేర్చి 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ వేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వ్యాక్సిన్ నిలువలు జిల్లాలో తగినంతగా ఉన్నాయని మంత్రి అన్నారు. గ్రామీణ ప్రాంతాలతోపాటు మున్సిపాల్టీలలో కూడా ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమం కింద అందరికీ టీకాలు వేసి థర్డ్ వేవ్ రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ధరణి పోర్టల్ ను ప్రవేశపెట్టి భూముల రిజిస్ట్రేషన్ల లో అక్రమాలు, అవకతవకలు లేకుండా అప్పటికప్పుడే ఖర్చులేకుండా రిజిస్ట్రేషన్లు చేస్తుందని తెలిపారు. రిజిస్ట్రేషన్ లో ఇంకా ఏవైనా ఇబ్బందులు ఉంటే కలెక్టర్ దృష్టికి తేవాలన్నారు.
రైతులు పంట మార్పిడి విధానం అవలంభించాలని పప్పుదినుసులకు ఎక్కువగా డిమాండ్ ఉన్నందున శెనగలు, నువ్వులు, కందులు, వేరుశనగ తదితర పంటల సాగుపై ఆసక్తి చూపాలన్నారు. FCI దొడ్డు బియ్యం కొనుగోలును నిరాకరించినందున వేసవిలో దొడ్డు బియ్యం సాగు చెయ్యొద్దని మంత్రి రైతులకు సూచించారు. జిల్లాలో సారంగాపూర్ మండలంలోని భూములు ఆయిల్ ఫామ్ సాగుకు అనుకూలంగా ఉన్నందున రైతులు ఆయిల్ ఫామ్ సాగును చేయాలని కోరారు.
ముథోల్ శాసనసభ్యులు శ్రీ విఠ్టల్ రెడ్డి మాట్లాడుతూ కుబీర్, తానూర్, కుంటాల మండలలోని 600 ఎకరాలకు పట్టాలు రాలేదని అధికారులు వెంటనే పాస్ బుక్స్ ఇచ్చే ప్రయత్నం చేయాలన్నారు. ST తండాలు, గూడెంలలో ప్రజలు వ్యాక్సినేషన్ కు బయటపడుతున్నందున అవగాహన కల్పించాలని, PHC లలో డాక్టర్లను డిప్యూటేషన్ పై వేరే చోటుకి పంపరాదని కోరారు.
ఖానాపూర్ శాసన సభ్యురాలు శ్రీమతి రేఖా నాయక్ మాట్లాడుతూ ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉపాద్యాయులు మరియు వైద్య సిబ్బందిని ఇతర ప్రాంతాలకు డిప్యూటేషన్ పై పంపవద్దని కోరారు .
జిల్లా కలెక్టర్ ముషార్రఫ్ ఫారూఖి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 3 లక్షలమందికి వ్యాక్సినేషన్ జరిగిందన్నారు. ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్లో ప్రతిరోజూ 15,000 నుండి 20,000 మందికి టీకాలు వేస్తున్నారని తెలిపారు. ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సులభతరం అయిందని, కొన్ని సమస్యలు ఉన్నందున మంత్రిగారితో చర్చించి పరిష్కరిస్తామన్నారు.
ITDA, PO భువనేష్ మిశ్రా మాట్లాడుతూ నిర్మల్ జిల్లాలో 31,245 ఎకరాలకుగాను 8533 దరఖాస్తులు రాగా 16,589 ఎకరాలకుగాను 5,500 మంది గిరిజనులకు హక్కుపత్రాలు అందచేయడం జరిగిందన్నారు.
ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి కె. విజయ లక్ష్మి, మున్సిపల్ చైర్మన్ శ్రీ గండ్రత్ ఈశ్వర్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ శ్రీమతి నర్మదా ముత్యంరెడ్డి, గ్రంథాలయ చైర్మన్ శ్రీ ఎర్రవోతు రాజేందర్, అదనపు కలెక్టర్లు శ్రీ హేమంత్ బోర్ఖడే, శ్రీ పి. రాంబాబు, DFO శ్రీ వికాస్ మీనా, ZPTCలు, MPP లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

********************జిల్లా పౌరసంబంధాల అధికారి, నిర్మల్ చే జారీ చేయనైనది.

Share This Post